ITBP Telugu Soldiers: ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇండియాకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు జవాన్లకు స్వగ్రామంలో అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. ఆప్ఘనిస్తాన్‌లోని కాబుల్, కాందహార్‌లో చిక్కుకున్న 62 మందికి పైగా భారతీయులను ఐటీబీపీ కమాండో అయిన మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట కు చెందిన ఎంబడి సురేష్ క్షేమంగా ఇండియాకు చేర్చారు. దీంతో స్వగ్రామంలో యువత అతడిని పెద్ద ఎత్తున కొనియాడుతుంది. ఆగష్టు 15న కాబుల్ తాలిబాన్ల వశమవడంతో స్వదేశం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కున్న భారతీయులను ఇండియన్ ఎంబసీలో సీనియర్ కమాండోగా విధులు నిర్వహిస్తున్న సురేష్ తన తోటి కమాండోలతో కలిసి క్షేమంగా ఎంబసికి చేర్చారు.
సీనియర్ కమాండోస్ రాజశేఖర్ ( శ్రీకాకుళం ), కేపి రెడ్డితో ( కడప ) పాటు 45 మంది ఐటిబిపి బృంద సహకారంతో భారతీయులను తాలిబాన్ల చెర నుంచి ప్రాణాలతో కాపాడగలిగామని టీవి9 తో తెలుగు జవాన్లు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. తుపాకులు చేతబట్టిన తాలిబన్లు రాజధాని కాబుల్ సహా ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా తిరుగుతుంటే.. అఫ్గాన్ ప్రజలతోపాటు విదేశీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతికారని అక్కడి దయనీయ పరిస్థితుల గురించి వివరించారు.
ఈ పరిస్థితుల్లో కాబుల్‌లోని భారతీయులను ఇండియా తరలించే ఆపరేషన్ చేపట్టామని దీనిలో ప్రత్యక్షంగా పాల్గొనడం సంతోషంగా ఉందని ఐటీబీపీలో సీనియర్ కమాండోగా విధులు నిర్వహిస్తున్న సురేష్ తెలిపారు. రెండేళ్లుగా డిప్యుటేషన్‌పై అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నానని పేర్కొన్నారు. విదేశాంగశాఖ ప్రతినిధులు, అధికారులను రెండు విడతలుగా స్వదేశానికి చేర్చేందుకు చేపట్టిన ఆపరేషన్, ఆ క్రమంలో ఎదురైన అవరోధాలు, వాటిని అధిగమించిన పరిస్థితులను టీవి9 కు ఫోన్ లో వివరించారు జవాన్లు సురేష్, రాజశేఖర్, కేపీ రెడ్డిలు.
Naresh, TV9 Telugu, Adilabad dist