Bhainsa Tension: నిర్మల్ జిల్లా(Nirmal District) భైంసాలో పోలీసుల కవాతు(Police Parade) నిర్వహించారు. భైంసా పట్టణం మొత్తం బలగాలను మోహరించారు పోలీసులు. వందల మంది పోలీసులు నగర రోడ్లపై కవాతు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్‌కు ప్రజలందరూ సహకరించాలంటూ మైక్స్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఏటా శ్రీరామనవమి(Srirama Navami)కి భైంసా నివురుగప్పిన నిప్పులా మారుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొంటాయి. అందుకే, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపడతారు. అందులో భాగంగానే, పట్టణం మొత్తం బలగాలను మోహరించారు పోలీసులు.
బైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలా మైదాన్ మీదుగా ఊరేగింపు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు పేర్కొంది. బైంసాలో గతంలో పలు సందర్బాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో బైంసాను అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించిన పోలీసులు శోభాయాత్రకు అనుమతివ్వలేదు. దీంతో హిందూ వాహిని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు శోభయాత్రకు షరతులతో కూడిన అనుమతిచ్చింది.
భైంసాలో రేపు జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణమంతా బలగాలను మోహరించారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలిసేలా డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. శాంతియుత వాతావరణంలో శోభాయాత్రను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఏఎస్పీ కిరణ్ కారే. హైకోర్టు షరతులను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏఎస్పీ కిరణ్.
ఇదిలావుంటే, శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు హైదరాబాద్, బైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం సూచించింది. బైంసాలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. శాంతిభద్రతల దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభయాత్రకు అనుమతిచ్చినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు, భైంసాలో శోభయాత్ర నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే, పలు షరతులు విధించారు. శోభయాత్రలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఘటనలు జరిగిన కేసులు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది. 2021లో జరిగిన గొడవల కేసులో ముద్దాయిగా ఉన్నవారు పోలీస్ స్టేషన్ సమక్షంలో ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
Read Also… Telangana: ఆ పబ్స్ వెంటనే క్లోజ్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్