
కుమారీ ఆంటీని తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ సమీపంలో పెట్టిన ఫుడ్ స్టాల్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. వెజ్, నాన్ వెజ్ భోజనాలను సరసమైన ధరలకే అందిస్తూ ఉండటంతో.. ఆమె వద్దకు స్థానికులతో పాటు ఫుడ్ లవర్స్ క్యూ కట్టారు. ఇక ఫుడ్ వ్లాగర్స్, యూట్యూబ్ వాళ్లు సందడి కూడా అక్కడ పెరిగిపోవడంతో.. స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో స్టాల్ తీసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశం అప్పట్లో నెట్టింట దుమారం రేపింది. ఆమె తన పొట్ట కొట్టారంటూ బాధను వ్యక్తపరచడంతో విషయం సీఎం రేవంత్ దాకా వెళ్లింది.
కుమారి స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను తీయకుండా.. ఆమెను ఇబ్బంది పెట్టకుండా.. ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో కుమారీ ఆంటీ సీఎం రేవంత్‌కు రుణపడి ఉంటానని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. తాజాగా కుమారీ ఆంటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఈసారి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తాను పూజించే దేవుళ్ల గదిలో పెట్టుకుంది కుమారి ఆంటీ. సీఎం రేవంత్‌కు నిత్యం పూజలు చేయడం హాట్ టాపిక్ అయింది. తన ఫుడ్ స్టాల్ ఈరోజు ఉందంటే, తక్కువ ధరలో మంచిగా కడుపు నిండా అన్నం పెడుతున్నానంటే.. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని కుమారి అంటీ చెబుతున్నారు. అందుకు తనకు ఆయన దైవంలాంటి వారని వెల్లడించారు. ప్రతిరోజు తన దేవుళ్లతో పాటు, రేవంత్ ఫోటోకు కూడా దండం పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తానని కుమారీ ఆంటీ చెప్పడం విశేషం..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..