
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సైబర్ నేరాలను, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రస్తుతం, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు. ఆ దిశగా యువ ఐపిఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ బదిలీల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
యువ ఎస్పీలకు డీసీపీలుగా పోస్టింగ్
జిల్లాల్లో అదనపు ఎస్పీలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న యువ అధికారులను ఎంపిక చేసి, వారికి నగరంలో ట్రాఫిక్ డిసిపిలుగా పోస్టింగులు ఇచ్చారు. ఈ బదిలీల్లో భాగంగా కొత్తగూడెం ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా ఉన్న అవినాష్ కుమార్ ను హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి-1 (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు) గానూ, ఉట్నూరు అదనపు ఎస్పీగా ఉన్న కాజల్ ను హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి-2 (గోల్కొండ, జూబ్లీహిల్స్ జోన్లు) గానూ నియమించారు. అదేవిధంగా జగిత్యాల అదనపు ఎస్పీ ఎస్. శేషాద్రిని రెడ్డిని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి-2 (కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) బాధ్యతల్లోకి తీసుకురాగా, భువనగిరి అదనపు ఎస్పీ కనకాల రాహుల్ రెడ్డికి మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ డిసిపి-1 బాధ్యతలు అప్పగించారు.
ములుగు జిల్లా ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయను ప్రతిష్ఠాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపిగా నియమించడం విశేషం. రైల్వేస్ డిఐజి హోదాలో ఉన్న జి. చందనా దీప్తిని ఫ్యూచర్ సిటీ అడ్మిన్ మరియు ట్రాఫిక్ అదనపు సీపీగా నియమించగా, హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా ఉన్న బికే రాహుల్ హెగ్డేను అదే కమిషనరేట్ లో ట్రాఫిక్ డిసిపి-3 (చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు) గాను, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా ఉన్న జి. రంజన్ రతన్ కుమార్ ను అక్కడే ట్రాఫిక్ డిసిపి-1 (శేర్లింగంపల్లి జోన్) గాను ప్రభుత్వం బదిలీ చేసింది.
అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలను అడ్డుకునేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్‌లో డిఐజి గా అభిషేక్ మహంతిని నియమించారు. తద్వారా సహజ వనరుల లూటీని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా కఠిన చర్యలు చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే, తాజా ఐపిఎస్ అధికారుల బదిలీల్లో అటు అనుభవానికి, ఇటు యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.