Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఈ మేరకు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులను రిలీజ్ చేశారు. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇవి జమ కానున్నాయి. గత నెలలో తొలి విడత సొమ్మును ప్రభుత్వం రిలీజ్ చేసింది.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..
Rythu Bharosa Second Installment

Updated on: Apr 20, 2026 | 8:44 PM

తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ విడుదల చేశారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. తొలి విడత నిధులను గత నెలలో రేవంత్ విడుదల చేయగా.. రెండో విడత సొమ్మును కూడా ఆయనే స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో 45 లక్షల 11 వేల 947 మంది రైతులకు రూ.5,563 కోట్లు జమ కానున్నాయి.

రెండో విడత విడుదల

తొలి విడత నగుదును గత నెల 23వ తేదీన ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో రూ.3,590 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఇక మూడో విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. మే కల్లా లబ్దిదారులందరికీ ఎకారానికి రూ.6 వేల చొప్పున జమ కానున్నాయి. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రైతు ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో భాగంగా రైతు భరోసా సొమ్మును రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలిపార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశమంతా రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ తెలిపారు.

వచ్చే నెలలో మూడో విడత

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేసినట్లు రేవంత్ తెలిపారు. గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు జమ చేశామన్నారు. ఇవాళ రెండో విడతగా రూ.5,700 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు.

Follow Us