ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీని కలిశారు. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా రేవంత్ .. సోనియాగాంధీని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు సోనియాగాంధీ ఒప్పుకున్నారని.. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో సోనియాగాంధీ పర్యటన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
ఇక, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించనున్నట్టు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ జాబితాను తయారు చేసే బాధ్యతను కోదండరామ్‌కు అప్పగించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం దక్కుతుందని తెలిపారు. ప్రజా తెలంగాణలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయని సీఎం రేవంత్ అన్నారు.
అంతకుముందు ఢిల్లీ పర్యటనలో ఏఐసీపీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిశారు తెలంగాణ సీఎం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఆయనతో చర్చించారు. అంతకుముందు మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్నారు. కొన్ని వస్తువులు పోయాయన్న ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని.. తన పరిపాలన పూర్తి పారదర్శకమంటూ సీఎం రేవంత్ వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..