AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నీరు వదులుకోం.. చిల్లర పంచాయతీలు చేయం.. జల హక్కుల్లో రాజీ పడం: సీఎం రేవంత్ రెడ్డి!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా, పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.

చుక్క నీరు వదులుకోం.. చిల్లర పంచాయతీలు చేయం.. జల హక్కుల్లో రాజీ పడం: సీఎం రేవంత్ రెడ్డి!
Cm Revanth Reddy Inspected Major Irrigation Projects
Balaraju Goud
|

Updated on: Jun 05, 2026 | 8:34 PM

Share

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా, పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులను మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కొత్తూరు కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులకు కీలకమైన భూసేకరణ చేయకుండా, కేవలం పంపులు, లిఫ్ట్‌లకే నిధులు ఖర్చు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన సాగునీటి అప్పులకు సంబంధించి, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 30 నెలల్లోనే అసలు, వడ్డీల రూపంలో రూ. 52,121 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ, కొత్తగా ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ. 22 వేల కోట్లలో, ఒక్క పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసమే రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 4 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, రైతులు అడిగే ధర కొంచెం ఎక్కువైనా నిధులు విడుదల చేసి భూసేకరణ పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పంపులు, లిఫ్ట్‌లు, కెనాళ్లను 2027 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని, లక్ష్మిదేవిపూర్ వరకు నీటిని తరలించే అంశంపై వచ్చే 6 నెలల్లో సమీక్షిస్తామని చెప్పారు. కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణంపై సాంకేతిక నిపుణులతో చర్చించి, అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామన్నారు.

గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నికర జలాల వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే డిసెంబర్ నాటికి కృష్ణా జలాల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలతో చిల్లర పంచాయతీలు కాకుండా వ్యూహాత్మకంగా సమస్యల పరిష్కారమే తమకు కావాలన్నారు. అలాగే, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి వడ్లు కొనుగోలు చేయకపోవడం సరికాదని, రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేటాయించాలని సీఎం డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us