
ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి చాటిచెప్పారు. సోమవారం సచివాలయంలో ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా, ఉద్యోగ వర్గాలకు సంబంధించి సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. బకాయి ఉన్న డీఏ ఫైలుపై సంతకం చేయడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ప్రమాద బీమాను ప్రకటించి ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు అదనంగా రూ. 227 కోట్ల భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల అవసరాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. సీఎం వస్తున్నారంటే ఏదో ఒకటి వస్తుందని ఆశించే ఉద్యోగులను నిరాశపరచకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన తెలిపారు.
ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఇది దేశంలోనే అత్యుత్తమ బీమా సౌకర్యాలలో ఒకటిగా నిలవనుంది.
గత పాలకులు వదిలివెళ్లిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూనే, ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్ చెప్పారు. “రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.
జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని.. దీనివల్ల ఉద్యోగుల కేటాయింపులు, పాలనలో ఇబ్బందులు వస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై రిటైర్డ్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి, తక్కువ మండలాలతో ఉన్న జిల్లాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు తానంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.