
తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు ముందే లీకవుతున్నాయా? అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చెప్పబోతోంది..? అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతోంది..? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనే విషయాలు ప్రతిపక్షాలకు ముందే చేరుతున్నాయా? అంటే అవుననే అనుమానిస్తోంది ప్రభుత్వం. అందుకే నష్టనివారణ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది.. ఆస్తులు.. అప్పులు.. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయం. అయితే ఈ క్రమంలో కొంతమంది అధికారుల నుండి లీకవుతున్న సమాచారం.. విపక్షాలకు ఆయుధంగా మారుతోంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందే.. వాటికి విపక్ష సభ్యులు అంశాలవారీగా కౌంటర్ సిద్ధం చేయడంతో ప్రభుత్వం ఈ అనుమానానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే శ్వేతపత్రాలను ఎవరితో చేయించారు అన్న సమాచారం కూడా ప్రతిపక్షాలకు చేరడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. లీకైన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ శ్వేతపత్రానికి..ప్రతిపక్ష సభ్యులు కౌంటర్ సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన.. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నివేదికలు, సమీక్షల్లో అంతర్గతంగా చర్చించిన అంశాలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది. అదే అంశాన్ని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసిన సిబ్బందిపై కూడా నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
ఈ నెల 7న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేరోజు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్‌లో సీఎం ఏం మాట్లాడారు? మంత్రులు ఏం చెప్పారు అనే మొత్తం సమాచారం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత ధరణితో పాటు డ్రగ్స్‌పై సమీక్షల్లో కూడా ఏం జరిగిందనే వివరాలు కూడా లీకయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పాటు మంత్రుల కదలికలు, అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతోందనే విషయాలు కూడా.. ముందస్తుగానే బయటకు వస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారో ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పీఏ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఆర్‌ఓలుగా పనిచేసిన వారిని తొలగించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇప్పటికైనా లీకులు ఆగుతాయో లేక కొనసాగుతాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..