CM KCR – Gadkari: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి సీఎం కేసీఆర్.. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఐదు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు. ఎన్ 165 హైదరాబాద్ (ఓఆర్ఆర్)- కల్వకుర్తి వరకు ఉన్న రహదారి నాలుగు లైన్ల రహదారిగా గుర్తించాలని గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు. 2021-2022, 2022-2023 రెండు ఆర్థిక సంవత్సరాల్లో సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సిఆర్ఐఎఫ్) కింద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించాలని గడ్కరీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సిఆర్ఐఎఫ్ కింద ఏడాదికి రూ. 250 కోట్లు రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని.. చౌటుప్పల్-షాద్ నగర్- సంగారెడ్డి మధ్య 182 కిలో మీటర్లు నిర్మించే సదరన్ ఎక్స్ప్రెస్ వే ను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన ఎన్ 65 ను ఆరు లైన్ల రహదారిగా మర్చే అంశం దృష్టి సారించాలని.. త్వరగా ఈ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కూడా కేసీఆర్.. గడ్కరీకి విన్నవించారు. నాలుగు కీలకమైన రాష్ట్ర రహదారులు.. చౌటుప్పల్-అమన్ గల్- షాద్ నగర్- కందీ, కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, కొత్త కోట-గూడురు మీదుగా మంత్రాలమ వరకు, బీదర్-జహీరాబాద్-బీదర్ లను జాతీయ రహదారులుగా మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు కేసీఆర్.
ఇంకా, సీఎం సమర్పించిన వినతి పత్రాల్లో వివరాలెలాఉన్నాయంటే..
> తెలంగాణకు రాష్ట్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధుల కింద 2021 ఏడాదికి రూ. 744 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆమోదం పొందిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను మంజూరు చేయాలని వినతి.
> రాష్ట్ర వ్యాప్తంగా 3,306 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 2,168 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు. మిగిలిన 1,138 రహదారుల్లో 4 రాష్ట్ర అత్యంత ప్రధాన రహదారులు ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డులో భాగమైన చౌటుప్పల్-కంది 182 కిలోమీటర్లు. కరీంనగర్-పిట్లం 165 కిలోమీటర్లు, కొత్తకోట – మంత్రాలయం 70 కిలోమీటర్లు, జహీరాబాద్-దేగ్లుర్ 25 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని వినతి.
అంటూ సీఎం కేసీఆర్ వినమ్రంగా కేంద్రమంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు, కేంద్రమంత్రి భేటీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎంపీలు హాజరయ్యారు.
Read also: B-Hub: అబ్బురపరిచేలా బీ-హబ్ భవనం నమూనా డిజైన్.. తెలంగాణ ఫార్మా రంగంలో మరో అద్భుతం