వరుస సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్. నిన్న సిరిసిల్ల, సిద్ధిపేటలో పర్యటించిన గులాబీ బాస్.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో పర్యటించబోతున్నారు. సభ ఎక్కడైనా.. కాంగ్రెస్సే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ సభతో సమరశంఖాన్ని పూరించిన సీఎం కేసీఆర్.. సుడిగాలి పర్యటనలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు.
రోజూ కనీసం రెండు చోట్లు బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ జడ్చర్ల, మేడ్చల్ బహిరంగ సభల్లో పాల్గొని కార్యకర్తలకు జోష్ నింపబోతున్నారు. గుండ్లపోచంపల్లి సమీపంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు మేడ్చల్ నియోజకవర్గం నుంచి 70 వేల పైచిలుకు జనసమీకరణ చేసేలా మంత్రి మల్లారెడ్డి ప్రణాళిక చేశారు. ఇక జడ్చర్లలోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు.
కుమారుడు పోటీ చేస్తున్న సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లకు ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టమని అన్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికుల బతుకులు మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సిరిసిల్ల వాసులు కోరుకుంటున్నట్టుగా సిరిసిల్లను మరో సోలాపూర్‌గా మార్చుతామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
నేత కార్మికుల బతుకులు బాగుచేసేందుకు బతుకమ్మ చీరలు తెచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. వాటిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. సిరిసిల్ల నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తనను నాయకుడిని చేసిన సిద్దిపేట రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు. తన సన్నిహితులను పేరు పేరునా గుర్తు చేసుకున్నారు. ఆరడుగుల బుల్లెట్ అంటూ హరీష్‌రావును కొనియాడారు.