CM KCR: తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు.. సీఎం కేసీఆర్ ఎమోషనల్

పదవి కోసం కొట్లాట కాదు.. పేదరికం అంతమే తన ఆరాటమన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజా ఆశీర్వాద సభలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న గులాబీ బాస్‌.. కాంగ్రెస్‌ తీరును అడుగడుగునా ఎండగట్టారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని పదేళ్ల పాలనలో పోగొట్టానన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని చెప్పారు.

CM KCR: తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు.. సీఎం కేసీఆర్ ఎమోషనల్
CM KCR

Updated on: Nov 26, 2023 | 9:54 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలపై విమర్శల పదును పెంచారు సీఎం కేసీఆర్‌. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఎలా జరిగిందో తన పదేళ్ల పాలనలో ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని తన పదేళ్ల పాలనలో పోగొట్టానన్నారు కేసీఆర్‌. వేములవాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలోనూ సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, ఆ కాలంలో ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదని చెప్పారు కేసీఆర్‌.

జగిత్యాలలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను తెచ్చిన కీర్తి తనకు చాలని, ఇంకేమీ వద్దని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్లు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. పేదరికం లేని తెలంగాణ కావాలన్నదే తన తపన అన్నారు. కేరళ మాదిరిగా 100 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తయారు కావాలన్నారు.

దుబ్బాకలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 24గంటల విద్యుత్‌, రైతు బంధు, రూ.5వేల పింఛను రావాలంటే కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే అన్నారు. దుబ్బాక నాది.. అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దుబ్బాకలోనే హైస్కూల్‌ విద్య కొనసాగిందని గుర్తు చేసుకున్నారు సీఎం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..