Paper Leak: ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రిగా ఉండే అర్హతలేదు.. రాష్ట్రంలో తిరగకుండా నిరుద్యోగులే అడ్డుకోవాలి: భట్టివిక్రమార్క

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. పేపర్‌లీక్‌పై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

Paper Leak: ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రిగా ఉండే అర్హతలేదు.. రాష్ట్రంలో తిరగకుండా నిరుద్యోగులే అడ్డుకోవాలి: భట్టివిక్రమార్క
Bhatti Vikramarka

Updated on: Mar 22, 2023 | 6:20 AM

కొమురంభీంజిల్లాలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కొనసాగింది. ఆరవ రోజు జామ్నే నుంచి కెరమెరి ఘాట్‌రోడ్డు మీదుగా మండల కేంద్రానికి యాత్ర సాగింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క భట్టివిక్రమార్కకు స్వాగతం పలికి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కెరిమెరలో రాత్రి జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో భట్టి విక్రమార్క పేపర్‌ లీకేజీ వ్యవహారంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

పేపర్‌ లీకేజీ వ్యవహారం సర్వసాధారణమని మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి… మంత్రిగా ఉండే అర్హతలేదన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకూ రాష్ట్రంలో ఎక్కడా తిరగకుండా యువత, నిరుద్యోగులు అడ్డుకుని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోని మంత్రులకు..కనీసం ఇంగితజ్ఞానం కూడా లేదన్నారు భట్టి. మంత్రి తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క.

తెలంగాణలో మరో మంత్రి ఇలా మాట్లాడకుండా ఉండాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకునే విధంగా యువత, నిరుద్యోగులు అడుగడుగునా ఆయన్ని అడ్డుకోవాలన్నారు. ఎంతో ఖర్చుపెట్టుకొని హైదరాబాద్‌ వచ్చి నెలల తరబడి నిరుద్యోగ యువతీ యువకులు పరీక్షలకు సిద్ధమైతే, మీ చేతగాని తనంతో వారికి తీవ్ర అన్యాయం చేస్తారా? అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..