CJI NV Ramana Inaugurates of IAMC: దేశంలోనే మరెక్కడా లేని విధంగా.. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైంది. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇదే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సైతం పాల్గొన్నారు. వీరితో పాటు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు.. కూడా పార్టిసిపేట్ చేశారు. నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ను ముఖ్యమంత్రి కేసీఆర్.. జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలో సొంత భవనం నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
త్వరితగతిన, సమర్థవంతమైన వివాద పరిష్కార వేదికగా ఇది ఉపయోగపడుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. వివేకవంతులందరూ అహంభావాలను విడిచిపెట్టి, ఆచరణాత్మకతను స్వీకరిస్తారన్నారు. భారతదేశపు మొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని (IAMC) శనివారం హైదరాబాద్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ప్రారంభించారు. వివాదాలను త్వరగా పరిష్కరించడానికి తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వంటి సమస్యలను IAMC ఆవిర్భావం అధిగమించగలదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటుకు ఎంపిక చేసినందుకు సీజేఐకి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సెంటర్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
హైదరాబాద్‌ను అత్యంత ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరు. అలాంటి వ్యక్తి ఆశీస్సులతో ఒక గొప్ప సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మిడియేషన్ సెంటర్ హైదరాబాద్ గా గొప్ప పేరు తెస్తుందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ అన్న సీఎం.. ప్రపంచ వేదికలకు దీటుగా హైదరాబాద్ నిలిచిందన్నారు. కోర్టుల్లో పరిష్కారం కానీ సమస్యలను ప్రత్యామ్నాయ ఫోరమ్ ఉండటం మంచి పరిణామమన్నారు. ఈ సెంటర్ ప్రారంభానికి ముందే ఒక పెద్ద కేసు వచ్చిందన్న సీఎం.. పెద్ద కాంట్రాక్టులు, ఒప్పందాలకు లోకల్ ఆర్బిట్రేషన్ కోసం రాష్ట్రంలో చట్టాలను సవరిస్తామన్నారు.