వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!

పోలీసులు వారి వృత్తి ధర్మంలో ఎన్నో కేసులు పరిష్కరించి ఉంటారు.. కానీ కొన్ని ఘటనలు అటు ఖాకీలు, ఇటు సామాన్యుల గుండెలను కదిలిస్తాయి. అలాంటి కథనాలు జర్నలిస్టులను కూడా చెల్లించిపోయేలా చేస్తాయి. అలాంటి సంఘటనే ఇది.. యాచకుల వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారులు ఉన్నత కుటుంబాల వద్దకు చేరారు. వాళ్ల జీవితాలు బాగుపడ్డాయి అనుకుంటే.. ఆ కిడ్నాపర్లు ఖాకీలకు చిక్కడంతో వారి తలరాత మళ్ళీ వెనక్కి తిరిగింది.

వీడిన యాచకుల పిల్లల కిడ్నాప్ మిస్టరీ.. ఖాకీల గుండెలు కదిలించిన విషాద ఘటన..!
Warangal Cp Sunpreet Singh

Edited By:

Updated on: Jan 10, 2026 | 6:49 PM

పోలీసులు వారి వృత్తి ధర్మంలో ఎన్నో కేసులు పరిష్కరించి ఉంటారు.. కానీ కొన్ని ఘటనలు అటు ఖాకీలు, ఇటు సామాన్యుల గుండెలను కదిలిస్తాయి. అలాంటి కథనాలు జర్నలిస్టులను కూడా చెల్లించిపోయేలా చేస్తాయి. అలాంటి సంఘటనే ఇది.. యాచకుల వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారులు ఉన్నత కుటుంబాల వద్దకు చేరారు. వాళ్ల జీవితాలు బాగుపడ్డాయి అనుకుంటే.. ఆ కిడ్నాపర్లు ఖాకీలకు చిక్కడంతో వారి తలరాత మళ్ళీ వెనక్కి తిరిగింది. కథ మొదటికే వచ్చింది. ప్రస్తుతం CWC పర్యవేక్షణలో ఉన్న ఆ చిన్నారులు మళ్లీ తిరిగి కన్నవారి చెంతకు చేరి యాచించుకునే పరిస్థితి రాబోతుంది. విధి ఆడిన ఈ వింత నాటకం ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిలా చేసింది. కొన్నవారు.. అమ్మినవారు సైతం కటకటాల పాలయ్యారు.

వరంగల్ పోలీసులు ఒక కిడ్నాప్ ముఠా రాకెట్ గుట్టురట్టు చేశారు. ఆరుగురు చిన్నారులను సేవ్ చేశారు. ఆ చిన్నారులను రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కిడ్నాప్ చేశారు. ఇందుకు సంబంధించి పెద్దపల్లి జిల్లాకు చెందిన నరేష్, యాదగిరి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే, పోలీసులు విచారణలో అందరి హృదయాలను కదలించే విషయాలు బయటపడ్డాయి.

అరెస్ట్ అయినవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసి వివిధ ప్రాంతాల్లో పిల్లలులేని దంపతులకు అమ్మినట్లుగా గుర్తించారు. 2017 నుండి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను ఇలా కిడ్నాప్ చేసి అనాథ పిల్లలని చెప్పి పిల్లలేని దంపతులకు విక్రయించారు. వారు ఈ యాచకుల పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులు వారిని కన్న బిడ్డలకంటే ఎక్కువ చూసుకుంటున్నారు. యాచకుల పిల్లల తలరాతే మారిపోయింది.

కానీ డిసెంబర్ 28వ తేదీన కాజీపేట రైల్వే స్టేషన్ లో జరిగిన ఓ ఘటనతో ఈ గుట్టు బయట పడింది. కాజీపేటలో బిక్షాటన చేసుకునే దంపతుల కొడుకు ఐదు నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త సహకారంతో సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. పెద్దపెల్లి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కాజీపేటలో కిడ్నాప్ అయిన బాలుడుతో సహా 2017 నుండి ఇప్పటివరకు వీళ్లు ఆరుగురు పసిపిల్లలను కిడ్నాప్ చేసి అమ్మినట్లు గుర్తించారు. కిడ్నాప్ చేసినవారిని గుర్తించి, కొన్నవారిని అమ్మినవారిని అరెస్టు చేశారు.

అయితే, ఈ పిల్లలు అందరిని వివిధ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కిడ్నాప్ చేసి వేరువేరు ప్రాంతాల్లో పిల్లలలేని వారికి విక్రయాలు జరిపారు. తాజా ఘటనలో చట్ట ప్రకారం ఇలా కొనడం.. అమ్మడం.. కిడ్నాప్ చేయడం నేరం కాబట్టి పోలీసులు చట్టం పరిధికి లోబడి కొన్నవారిని అమ్మినవారిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

ఈ పిల్లల తల్లిదండ్రులు అంతా రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో కొంతమంది బెలూన్స్ అమ్ముకోవడం, మరి కొంతమంది యాచక వృత్తి ద్వారా జీవనం కొనసాగించేవారు. పిల్లలను కొనుక్కున్న వారి వద్ద అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. వారికి మంచి జీవితం లభించిందని భావించేలోపే ఏ దేవుడు ఎక్కిరించాడో ఏమో..! కానీ మళ్ళీ కథ మొదటికి చేరింది. ఆ చిన్నారులు మళ్లీ అదే ఫ్లాట్ ఫామ్ పైకి చేరి బెగ్గింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పోలీసులు చట్ట ప్రకారం కిడ్నాప్ చేసిన ఇద్దరితో పాటు ఈ పిల్లలను కొనుగోలు చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అంతా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కటకటాల్లోకి పంపారు. ఈ ఘటనలో అభం శుభం ఎరుగని చిన్నారుల జీవితాలు అగాధంలో చిక్కుకున్నాయి. ఈ ఆరుగురు చిన్నారులను ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..