
ప్రస్తుతం పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలకు ఆకర్షితులై బ్రతికేస్తున్నారు, తమ కోరికలు తీర్చుకునేందుకు తల్లిదండ్రులను సైతం నిత్యం సతాయిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు కూడా దాచిపెట్టుకోకుండా సరదాలు తీర్చుకునేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ ఈ చిన్నారులు మాత్రం అందుకు బిన్నంగా తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీనీ సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన కొందరు చిన్నారుల తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో మండుఎండలో వెళ్తున్న బాటసారులకు మజ్జిగ పంపిణి చేస్తూ వారి ఎండతాపాన్ని తీరుస్తున్నారు.
అశ్వాపురం మండలానికి చెందిన చిన్నారులు వినీత్, సాత్విక్, రాము, మనోజ్, నిక్కీ అనే ఐదుగురు స్నేహితులు తమ తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చే డబ్బులను తమ అవసరాలకు ఖర్చు చేసుకోకుండా.. ఆ డబ్బులతో మజ్జిగ, నిమ్మరసం తయారు చేసి మండుటెండలో వెళ్తున్న బాటసారులకు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చింతల బజార్‌లో మధ్యాహ్నం 11 గంటల నుండి ఒంటి గంట వరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్లు, ఉపాధి హామీ కార్మీకులు, బాటసారులు, వాహనదారులకు మజ్జిగ, నిమ్మరసాన్ని ఉచితంగా అందిస్తూ వారి దాహార్తిని తీరుస్తున్నారు.
మండుటెండలో చిన్నారులు చేస్తున్న సమాజ సేవను చూసి పలువురు వారిని అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే సమాజ సేవపట్ల వీరికి ఉన్న ఆసక్తిని చూసిన జనం శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఒక పేదవాడు పడే బాధ మరో పేద వాడికే అర్ధం అవుతుందని.. మీరు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి మరెంతో మందికి సేవ చేయాలని బాటసారులు ఆ చిన్నారులకు దీవెనలు అందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..