ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.
తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర పభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతిక కోర్సులను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి, స్వంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో పాల్గొన్న టాటా సంస్థ ప్రతినిధులకు, అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా ఆధునాతన కోర్సుల్లో శిక్షణకోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుందన్నారు.
రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐ.టీ.ఐలలో రూ. 1500 నుంచి రెండు వేల కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో4.0 ఇండస్ట్రీ ఆధారిత స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వహణకు కావాల్సిన మెషినరీ, పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను టాటా సంస్థ అందిస్తుంది. కాగా, రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులు శిక్షణ పొంది పలు పరిశ్రమలో ఉద్యోగాలు పొందే విధంగా తగు శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.
టాటా సంస్థతో తమ ప్రభుత్వం కలసి పనిచేస్తున్నదని , ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను కావాల్సిన ఎంఓయూ కుదుర్చుకోవడానికి గాను ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సి.ఎస్.ను కోరారు. యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సి.ఎన్.సి మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో తగు నైపుణ్యాన్ని ప్రభుత్వ ఐటీఐలలో అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా సీఎం ఇందుకు అంగీకరించారు.
కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌ను అందించడంతో పాటు ప్రతీ ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా అందిస్తుంది. దీనిలో భాగంగా ఆధునిక సాంకేతిక వర్క్ షాపులు, అత్యధిక డిమాండ్ కలిగిన తయారీ రంగంలో ఉపాధికల్పించడానికి 22 నూతన స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నీక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్ట్ లో టాటా సంస్థ అందిస్తుంది. ఇప్పటికే ఎంఓయూ విధివిధానాలు ఖరారు చేయడానికి రాష్ట్ర ఉపాధికల్పన, కార్మిక శాఖ టాటా టెక్నాలజీతో సంప్రదింపులు జరుపుతోంది. దీని ఆధారంగానే రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తించడం జరిగిందని అధికారులు తెలియ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..