
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దివ్యాంగులకు అండగా నిలిచేందుకు కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అనేక కొత్త పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లతో పాటు మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రారంభించింది. ఇక గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్లలోపు వాడుకున్నవారికి ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలాగే రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా నిధులను పెంచగా.. కౌలు రైతులు, రైతు కూలీలు, భూమి లేని రైతులకు ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేలు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టగా.. త్వరలో మరికొన్ని స్కీమ్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.
దివ్యాంగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ తెలిపారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు సోమవారం వెల్లడించారు. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా లేదా సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకున్నా రూ.2 లక్షలు సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి నేరుగా లబ్దిదారుల అకౌంట్లో వీటిని జమ చేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులను తమ సొంత కుటుంబ సభ్యుల్లా ప్రభుత్వం భావిస్తోందని, వాళ్లు ఆత్మగౌరవంతో జీవించేలా అన్ని విధాలుగా సహాయం అందిస్తామని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందు ఉంటాయని, వారికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామన్నారు. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారికి సామాజిక భద్రతతో పాటు ఆర్ధిక భద్రత కల్పించేలా కృషి చేస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.
సోమవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక పథకాన్ని సీఎం ప్రారంభించారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించాచరు. చదువుకున్న దివ్యాంగులకు స్వయం ఉపాధిక కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాలనలో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.