
ఈ ఆధునిక యుగంలో ఎక్కడ చూసిన కల్తీమయమే. బయట తినాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన చికెన్, అపరిశుభ్రమైన పదార్థాలతో వంట చేయడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేటు ఎదురుగా ఉన్న 4 చిల్లీస్ రెస్టారెంట్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులకు ఆహారంలో కోడి ఈకలు కనిపించాయి. దీనిపై రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థులు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కస్టమర్ల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బిర్యానీ నమూనాలను సేకరించి, అనంతరం రెస్టారెంట్ లోపల తనిఖీలు నిర్వహించగా వంటగదిలో కనీస పరిశుభ్రత లేకపోవడం సహా పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్, మయనీస్ లభించాయి. రెస్టారెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించకుండా ఉంచడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ రెస్టారెంట్‌పై గతంలో కూడా నాణ్యతలేని ఆహారం, ఆహారంలో కీటకాలు కనిపించాయంటూ పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని కస్టమర్లు తెలిపారు. నాణ్యతపై ప్రశ్నించినప్పుడు యాజమాన్యం రివర్స్‌లో బెదిరింపులకు పాల్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ.. అన్ని పదార్థాలకు సంబంధించిన శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. వాటి నివేదిక వచ్చిన అనంతరం రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.