Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన

యావత్ తెలంగాణను సొమవారం ఉదయం విషాదంలోకి నెట్టిన ఆర్సీబీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.7లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటిచింది. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మందికిపైగా మృతి చెందగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Chevella Bus Accident (1)

Updated on: Nov 03, 2025 | 11:48 AM

కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను విషాదంలోకి నెట్టింది. సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొని 19 మందిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.7లక్షలు, గాయపడిన వారికి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటిచింది. అలాగే ప్రమాద ఘటనపై విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది.

ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం

ఈ సందర్భంగా ప్రమాదంపై రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ప్రమాదంపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రమాదంలో 19కు చేరిన మృతుల సంఖ్య 

మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వారిని అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. ఇక ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం 40 మంది గాయపడగా 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం చేవెళ్ల ఆస్పత్రిలో 10 మందికి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకి తరలించినట్టు అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. పరిహారం ప్రకటన 

మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.