
పార్లమెంట్ ఎన్నికల వేళ ఓటర్ల ఆకర్షణకు పార్టీల అభ్యర్థులు కష్టపడుతున్నారు. ముఖ్యంగా రిజర్వడ్ స్థానాల్లో అయితే ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వడ్ స్థానమైన నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు సామాజిక సమీకరణల ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఎస్సీల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గంపైనే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం కోసం పార్టీల మధ్య త్రిముఖ పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు ఈ రిజర్వడ్ స్థానాన్ని కైవసం చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలో దింపడంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉండడంతో ఆ వర్గాల ఓటర్లును ఆకర్షించేందుకు ఎవరి ప్రణాళికలు వారు అమలు చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాల్, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అచ్చంపేట, అలంపూర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడ్. అయితే ఎంపీ నియోజకవర్గం మొత్తం కూడా ఎస్సీల ప్రభావం ఉండడంతో ఆ వర్గాల ఓట్లను టార్గెట్ చేస్తూ పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపిక చేశాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్ ను బరిలో నిలిపారు. కాంగ్రెస్ మాత్రం మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ మల్లు రవిని అభ్యర్థిగా పోటీలోకి దింపింది. మొత్తం పార్లమెంట్ పరిధిలో 17లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో సుమారుగా 5లక్షలకు పైగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ ఓటర్లలో సగానికిపైగా సాధించినా సునాయసంగా గెలవచ్చు అనే లెక్కల్లో అభ్యర్థులు ఉన్నారు.
ఇందుకోసం మండలాల వారీగా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీల అభ్యర్థులు గాలం వేస్తున్నారు. పోలింగ్ వరకు వారిని కాపాడుకొని గంపగుత్తగా ఓట్లు పొందాలని భావిస్తున్నారు. గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ సామాజిక వర్గం నేతలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇప్పటికే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం తన సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయ వర్గాలను ఆకర్షించేలా కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..