హైదరాబాద్ చింతల్‌లో పక్కకు ఒరిగిన భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. జాకీలతో భవనాన్ని ఎత్తులేపాలని చేసిన ప్రయత్నం విఫలమవడంతో పక్కకు ఒరిగిపోయింది శ్రీనివాస్‌నగర్‌లోని ఓ మూడంతస్థుల భవనం. దీంతో భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు బిల్డింగ్‌ని జేసీబీతో కుప్పకూల్చారు. మాలిక్ ట్రేడింగ్ & డిమోలిషన్ ఏజెన్సీ నేతృత్వంలో ఈ భవనం కల్చివేత పనులు చేపట్టారు. పక్కన ఉన్న ఇళ్ళకు ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ… ఆర్‌ఎఫ్, టౌన్ ప్లానింగ్, పోలీసుల సమక్షంలో కూల్చివేత ప్రక్రియను చేపట్టారు.
25ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ ఇది. రోడ్డుకన్నా.. బేస్‌మెంట్ కొంచెం కిందకు ఉంది. వాన వస్తే నీళ్లు నిలబడుతున్నాయని.. దానిని లిఫ్ట్ చేయాలనే ఆలోచన చేశాడు యజమాని. ఆ పనిని విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కి అప్పగించేశాడు. అయితే బిల్డింగ్ లిఫ్ట్ చేసే ప్రయత్నం విఫలమై భవనం పక్కకు ఒరిగిపోయింది. దీంతో బిల్డింగ్ 10 డిగ్రీల మేర పక్కకు ఒరిగింది. పక్క ఆపార్ట్‌మెంట్‌లో ఉండే వాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు. బిల్డింగ్ పక్కకు ఒరిగిపోవడంతో అందులో నివసిస్తోన్న ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉన్నఫళంగా కట్టుబట్టలతో బయటకు పరుగు పరుగున వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇంట్లోనే వస్తువులన్నీ ఉండిపోవడంతో…పిల్లాపాపలతో రోడ్డునపడ్డామంటూ గొల్లుమంటున్నారు బాధితులు. అధికారులు ఎందరో వచ్చి పోతున్నా తమను పట్టించుకున్న దిక్కులేదంటున్నారు.
పిల్లల ఆసుపత్రి రికార్డులు సైతం తీసుకోలేకపోయామనీ…ఇంట్లోవి ఒక్క వస్తువు కూడా తీసుకోలేదనీ… ఇప్పుడు మాకు దిక్కెవరంటూ లబోదిబోమంటున్నారు బాధితులు. ఓవైపు ఎటువంటి అనుమతులు లేకుండా భవనాన్ని అనధికారికంగా ఎత్తు పెంచాలని ప్రయత్నించిన ఓనర్ అద్దెకున్నవారి పరిస్థితిని పట్టించుకోలేదు. ఇక అధికారులు సైతం వారి గోడు వినడం లేదంటున్నారు బాధితులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం