
పేరుకు బడ్జెట్ సెషన్ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్ క్రషింగ్ వరకు పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల్లో 82 గంటల 47 నిమిషాల పాటు సాగింది.
10 రోజుల పాటు సాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు.. 82 గంటల 47 నిమిషాలపాటు సాగింది. మొత్తంగా 590 ప్రశ్నలు సంధించారు సభ్యులు. శాసన సభ ముందుకు 11 బిల్లులు రాగా, అందులో 10 బిల్లులకు ఆమోదం పొందాయి. సెలెక్ట్ కమిటీకి ఓ బిల్లును పంపారు. అలాగే, ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే పొలిటికల్‌గా టెంపర్ లేపారు అధికార, విపక్ష సభ్యులు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ BRS అన్నట్లుగా బడ్జెట్ సమావేశాలు సాగాయి.
ఈసారి ఎలాగైనా సరే అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన BRSకి అధికార పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం ఎత్తులను అసెంబ్లీలో తిప్పికొట్టడమే కాకుండా ఎదురుదాడి చేసింది. దీంతో బడ్జెట్ సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు మూసీ, రాఘవ కన్‌స్ట్రక్షన్ లాంటి అంశాలతో కాంగ్రెస్‌పై పైచేయి సాధించాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచించింది. కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కౌంటర్ ఇవ్వడంతో సెల్ఫ్ గోల్ వేసుకుందనే చర్చ సాగుతోంది. మూసీ ప్రక్షాళన అంశాన్ని అధికార పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూసీపై ప్రతిపక్షాలు ఎక్కుపెట్టిన విమర్శలకు శాసనసభ, మండలిలో సీఎం సమాధానం చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్యపై BRS నిరసన తెలుపుతూ వచ్చింది. మైనింగ్ శాఖపై చర్చ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ కన్‌స్ట్రక్షన్ పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని గులాబీ సభ్యులు ఆరోపణలు చేశారు.
దీనిపై హౌస్ కమిటీ వేయాలని BRS డిమాండ్ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పైనే కాదు గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కంపెనీలు చేస్తున్న మైనింగ్‌పై CBCIDతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని BRS ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న సమయంలో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి దుమారం రేపింది. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని అధికార పక్షం ఆరోపించింది. గన్‌తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మార్చి 26వ తేదీన అర్ధరాత్రి వరకు సాగిన చర్చలో కేటీఆర్, శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. మూసీ DPR సిద్ధమైతే బయటపెట్టాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు DPR.. ADB దగ్గర వెట్టింగ్‌లో ఉందన్నారు..
ఈసారి సమావేశాల్లో ఇప్ప పువ్వు సారా అంశం ఆసక్తికరంగా మారింది. ఎక్సైజ్ పద్దులపై చర్చ సందర్భంగా అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారాను ప్రభుత్వం ప్రమోట్ చేయాలంటూ తన వాయిస్ వినిపించారు. దీనిపై చర్చ సందర్భంగా ఇప్ప పువ్వు సారాకు ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనడంతో కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇందిరాగాంధీని అవమానించేలా రాకేష్ రెడ్డి కామెంట్స్ చేశారని అధికార పార్టీ సభ్యులు ఫైర్ అయ్యారు.
మొత్తంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న ప్రతిపక్షంపై చివరకు అధికార పార్టీనే పైచేయి సాధించిందన్న చర్చ సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..