
లోన్ యాప్ వేధింపులు భరించలేక నిత్యం ఎవరో ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మనోజ్ అనే బీటెక్ చదువుతున్న విద్యార్ధి లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. తమకు ఉన్న ఆర్ధిక పరిస్థితులను బట్టి ఈ మధ్యకాలంలో చాలామంది లోన్ యాప్‌లో డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత EMIలు సరైన సమయానికి చెల్లించలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈఎంఐ కాస్త ఆలస్యం అయితే చాలు.. రాబందుల్లా బాధితులను పీక్కు తింటారు ఈ లోన్ యాప్ ఏజెంట్లు. ఈ విధంగా లోన్ యాప్ వేధింపులు ద్వారా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతుండటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
తాజాగా లోన్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న శీలం మనోజ్.. స్కూల్, ఇంటర్‌లో టాపర్. అనంతరం బీటెక్‌లో మంచి ర్యాంక్ రావడంతో దుండిగల్‌లోని ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. గుడిమల్కాపూర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే మనోజ్ గత కొద్దిరోజుల నుంచి ఆన్లైన్‌లో గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో వివిధ యాప్‌ల నుంచి డబ్బులను తీసుకున్నాడు. ఇలా 2 సార్లు డబ్బులు తీసుకుని.. తిరిగి చెల్లించాడు. అలాగే మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు మనోజ్. ఆ డబ్బును చెల్లించినా సరే.. మళ్లీ లోన్ కట్టాలంటూ ఏజెంట్లు ఇబ్బందులకు గురి చేశారు. అంతటితో ఆగని ఏజెంట్లు.. మనోజ్ లోన్ తీసుకున్న విషయాన్ని అతడి బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో పాటు.. వారిని ఇష్టానుసారంగా దూషించేవారు. దీంతో పరువు పోయిందని భావించి మనస్థాపంతో మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విని.. అతడి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.