Telangana: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..

మున్సిపల్ పోరులో హంగ్ వచ్చిన స్థానాలపై పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికలు బీఆర్ఎస్‌కు అనుకోని వరంలా మారాయా? ఫిరాయింపు ఎమ్మెల్యేల పాలిట విప్ తలనొప్పిగా మారనుందా..? మ్యాజిక్ ఫిగర్ కోసం ఎమ్మెల్యేల ఓటు కీలకం కావడంతో.. అసమ్మతి నేతలను ఇరుకున పెట్టేందుకు కారు పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

Telangana: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్..
Brs Plan To Disqualify Defected Mlas Using Whip

Updated on: Feb 15, 2026 | 7:40 AM

మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు పెద్దగా కలిసి రాలేదు. కార్పొరేషన్లలోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి చేదు అనుభవాలు చవిచూస్తున్న బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికలు మరో రకంగా అనుకోని అవకాశం ఇవ్వబోతోందనే చర్చ జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఈ ఎన్నికలు బీఆర్ఎస్‌కు అనుకోని విధంగా కలిసొచ్చాయనే ప్రచారం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతి ఓటు కీలకం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక ప్రజాప్రతినిధులపైనే నెలకొంది.

ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి.. ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా విప్ ఆయుధాన్ని వాడుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో ఓటింగ్ సమయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా ఉండేందుకు విప్ జారీ చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేస్తే ఆ సాక్ష్యాలతో అనర్హత వేటు వేయించేందుకు అవకాశం దొరుకుతుందని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

ఈ రకంగా తమకు న్యాయపరంగా బలమైన ఆధారాలు సేకరించడానికి అవకాశం దక్కుతుందని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. విప్ ఉల్లంఘన ద్వారా ఆయా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా ప్రధానంగా పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌పై ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వీరి నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగడంతో విప్ ద్వారా వీరిని ఇరకాటంలో పడేయొచ్చన్న ఆలోచనలో కారు పార్టీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బీఆర్ఎస్ ఎత్తుగడలను గమనిస్తున్న సదరు ఎమ్మెల్యేలు కూడా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. విప్ జారీ చేస్తే ఓటింగ్‌లో పాల్గొని రిస్క్ తీసుకోవడం కంటే ఓటింగ్‌కు దూరంగా ఉండటమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు కాంగ్రెస్ స్నేహాన్ని కాపాడుకుంటూనే ఇటు పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవచ్చనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.