కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ కలవర పెడుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ వదలడం లేదు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ ని కూడా కబళించింది. ఆయన మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. విజయకాంత్ శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్థారించారు. వైరస్ శరీరంలో విజృంభించడంతో శ్వాసతీసుకోవడం కష్టంగా మారింది. వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు ప్రత్యేక చికిత్స అందించారు ప్రత్యేక వైద్య బృందం. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటి పోవడంతో తుదిశ్వాస విడిచారు విజయకాంత్.
ఆయన మరణం పట్ల యావత్ తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ వయసు 71 ఏళ్లు. గతేడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నవంబర్ 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతుండటంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఆ పుకార్లను ఆయన సతీమణి ప్రేమలత ఖండించారు. ఇలా మరణ వార్త వైరల్ అయిన తరువాత రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయ పార్టీ స్థాపించి తిరుగులేని శక్తిగా ఎదిగారు విజయకాంత్. కింగ్ మేకర్‌గా నిలిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..