తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న తరుణంలో తెలంగాణకు చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో దిగిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మోట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని, ఏడాదిలోపే భారాస ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని ఒక్కసారిగా బాంబు పేల్చాడు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గందరగోళంలో ఉన్నారన్న కడియం.. భారాసకు 39 సీట్లు వచ్చాయని, మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు ఉందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న భాజపాను కలుపుకొని, మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం కాదంటూ వ్యాఖ్యనించారు. కడియం చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి.
ఇదిలా ఉంటే.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే సైతం ఇలాంటి సంచలన కామెంట్స్ చేశారు. ఏడాదిలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందంటూ రాజాసింగ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదంటూ, ఒక్క ఏడాది మాత్రమే ఉంటుందని సంచలనం సృష్టించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారని విమర్శించారు.
ఇక మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణ రావు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..