వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారు. చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కమిట్మెంట్ చిట్టిల పేరుతో వరంగల్, హనుమకొండకు చెందిన సుమారు 100 మంది సభ్యుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలుచేసి సభ్యులకు చిట్టి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు 1 కోటి 15 లక్షలు రికవరీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26 వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేష్ పై గాలిపల్లి శ్రవణ్ కుమార్, తైలం గౌతమ్ సాగర్ అనే బాధితులు ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతని పై రెండు కేసులు నమోదు అయ్యాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు బాలిన సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుండి ఒక కోటి పదిహేను లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతను పది సంవత్సరాల నుండి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు విలువ గల కమిట్మెంట్ చిట్టీలు నడుపుతూ చాలామంది దగ్గర నమ్మకాన్ని సంపాదించారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా నిందితుడు తన చిట్టి సభ్యుల దగ్గర వసూలు చేసిన చిట్టి డబ్బులని నష్టపోయాడు. గత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాను కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పుడు తన సొంత అవసరాలకు వాడుకున్నారు.
అతను రాజకీయంగా ఎదగడానికి, తన ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసి, చిట్టి సభ్యులు అడిగినప్పుడు వాళ్లను మభ్యపెడుతూ కాలం గడుపుతూ వచ్చారు. వాళ్ళంతా నిలదేయడంతో తన ఇంటిని అమ్మి అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. తన ఇంటిని అమ్మి ఆ డబ్బులతో కొందరికి పెమెంట్స్ చేశారు. మిగిలిన డబ్బులను తన దగ్గర పెట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్పొరేటర్‌ను అరెస్ట్ చేసి ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..