BRS Manifesto: జనరంజక హామీలను మించిన పథకాలు.. ఇవాళ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం కేసీఆర్

Telangana Elections: ఇప్పటికే రెండు మేనిఫెస్టోల్ని రూపొందించి.. వాటిని అమల్లో పెట్టి విక్టరీ కొట్టిన కేసీఆర్. మూడో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. కానీ.. మేనిఫెస్టోకు మించి, మేనిఫెస్టోలో లేని అంశాలతో కూడా ప్రజలకు సర్‌ప్రైజ్ ఇవ్వడం ఆయనకు అలవాటే. గత రెండు దఫాల్లో ఆయన ఇలాగే ప్రజానీకాన్ని మెస్మరైజ్ చేశారు. వాళ్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ తొమ్మిదేళ్లలో మేనిఫెస్టోతో ప్రమేయం లేకుండా ఆయన అమల్లో పెట్టిన పథకాలేంటి.. వాటి ప్రోగ్రెస్‌ ఎక్కడ... ఈ చర్చ కూడా జోరుగా జరుగుతోంది తెలంగాణా పబ్లిక్‌లో.

BRS Manifesto: జనరంజక హామీలను మించిన పథకాలు.. ఇవాళ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం కేసీఆర్
Brs Manifesto

Updated on: Oct 15, 2023 | 7:45 AM

మేనిఫెస్టో అంటే ప్రజలకిచ్చే ప్రమాణ పత్రం. ఏ రాజకీయ పార్టీలకైనా అది భగవద్గీత, ఖురాన్, బైబిళ్లతో సమానం. దాని రూపకల్పన అనేది పార్టీ అధినేతలకు ఛాలెంజ్ లాంటిది. ప్రజల నాడి తెలుసుకుని వాళ్ల మనసెరిగి రాసుకోవాల్సిన మేనిఫెస్టోపై కసరత్తు చేయడం గులాబీ దళపతికి బాగా అలవాటున్న విషయమే.

కానీ.. ఇచ్చిన ప్రామిస్‌లే కాదు.. చెయ్యని ప్రమాణాలక్కూడా తన ప్రభుత్వ ప్రణాళికల్లో చోటు కల్పించడం కేసీఆర్ స్పెషాలిటీ. 2014 నుంచి 2018 వరకూ ఫస్ట్ టర్మ్‌లోనే మేనిఫెస్టోను దాటి ముందుకెళ్లారు గులాబీ దళపతి. డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ లాంటి జనరంజక హామీలకు మించి పథకాలు ప్రవేశపెట్టారు.

అందులో అత్యంత కీలకమైంది కేసీఆర్ కిట్..

ఆర్థికసాయంతో ఆదుకోవడం, పౌష్టికాహారంతో కడుపు నింపడం మాత్రమే కాదు… డెలివరీ తర్వాత 16 నిత్యావసర వస్తువులతో కేసీఆర్ కిట్ పేరుతో గర్భిణీలకు నజరానా ఇవ్వడం.. తెలంగాణాలో ఒక విప్లవాత్మక పథకం. అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయైతే 12 వేలు నగదు సాయానికి పాటు కేసీఆర్ కిట్ అదనం.

రెండోది కంటివెలుగు…

అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మేడిన్ తెలంగాణా అద్దాలు పంపిణీ చేసి.. కోట్లాది మంది కళ్లల్లో వెలుగులు నింపిన పథకం ఇది. దేశం మొత్తం తెలంగాణా వైపు చూసేలా చేసిన కంటివెలుగు రూపకర్తగా మిగతా సీఎంలకు రోల్‌మోడల్ అయ్యారు కేసీఆర్.

మూడోది… హాస్టళ్లలో సన్నబియ్యం

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం వాడకం… సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణాలో లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచింది. పట్టెడన్నం పెట్టడం… అదీ కాదు.. నాణ్యమైన అన్నం పెట్టడం బీఆర్‌ఎస్ సర్కార్‌కే చెల్లింది.

2018 నుంచి ఇవాళ్టి వరకూ కూడా మేనిఫెస్టోకు అతీతంగా సాగింది కేసీఆర్ ఆలోచన. 24 కీలక అంశాలున్న మేనిఫెస్టోలో అదనంగా మరికొన్ని చాప్టర్స్ చేరాయి. అప్పటికప్పుడు పొలిటికల్ సిట్యువేషన్, పబ్లిక్ డిమాండ్‌ను బట్టి… అనేక పథకాల్ని అమలు చేశారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.

దళిత బంధు… బీఆర్‌ఎస్ ఫ్లాగ్‌షిప్ స్కీమ్

ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక చేయూత. 2021 ఆగస్టు 16న ఒక్క నియోజకవర్గంతో మొదలైన దళితబంధు పథకం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. దళిత బంధు నమూనాతోనే బీసీ బంధు, మైనారిటీ బంధుపై కూడా దృష్టి పెట్టింది బీఆర్‌ఎస్. దళితబంధును జాతీయస్థాయిలో అమలు చేస్తానని కూడా హామీ ఇచ్చారు కేసీఆర్.

మేనిఫెస్టోలో ప్రస్తావించని మరో పథకం… మన ఊరు- మన బడి

ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2021 బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టిన పథకం మనఊరు-మన బడి. రాష్ట్రంలోని 27 వేలకు పైచిలుకు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 19 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది.

ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం. 23 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం. 27 వేల ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలే ప్రారంభమైన జనరంజక పథకం. ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యాహ్న భోజనానికి ఇది అదనం. సర్కారువారి ఈ నాష్టా పథకం సైతం 2018 నాటి మేనిఫెస్టోలో లేనిదే. ఇలా మేనిఫెస్టోలకు అతీతంగా… అనేక విధాన నిర్ణయాలతో తెలంగాణా ప్రజలకు మరింత చేరువయ్యామని భావిస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి