Telangana: అభ్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న హైమాండ్‌ ఫోన్‌ కాల్స్‌.. అసలేం జరుగుతోందంటే..

| Edited By: Narender Vaitla

Nov 04, 2023 | 7:23 AM

గులాబీ పార్టీలో అసమ్మతి రోజు రోజుకు మరింత పెరుగుతుందంట. ఇంఛార్జ్ లను రంగంలోకి దింపినా పరిస్థితి లో మార్పు రాకపోగా.. ఇంచార్జ్‌ల రాకతో పరిస్థితి మరింత జఠిలంగా మారిదంట. దీంతో నేరుగా అదిష్టానమే రంగంలోకి‌ దిగినట్టు తెలుస్తోంది. అసమ్మతి మరింత పెరిగిన నియోజక వర్గాల నేతలకు నేరుగా ఫోన్ చేస్తున్న సీఎం కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త అంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నట్టు సమాచారం. పెద్ద సార్ నుంచి..

Telangana: అభ్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న హైమాండ్‌ ఫోన్‌ కాల్స్‌.. అసలేం జరుగుతోందంటే..
Cm Kcr
Follow us on

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. నామినేషన్ల పర్వం ‌కూడా ప్రారంభం అయింది. ప్రచారం ఊపందుకుంది.. బీఆర్ఎస్ నేతల టికెట్లు రెండు నెలల కిందే ఖరారు కావడంతో ప్రచారంలో దూసుకు పోతున్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ ప్రతిపక్షాల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. అయినా ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొన్ని‌ నియోజక వర్గాల్లో పరిస్థితి మారలేదంట.

గులాబీ పార్టీలో అసమ్మతి రోజు రోజుకు మరింత పెరుగుతుందంట. ఇంఛార్జ్ లను రంగంలోకి దింపినా పరిస్థితి లో మార్పు రాకపోగా.. ఇంచార్జ్‌ల రాకతో పరిస్థితి మరింత జఠిలంగా మారిదంట. దీంతో నేరుగా అదిష్టానమే రంగంలోకి‌ దిగినట్టు తెలుస్తోంది. అసమ్మతి మరింత పెరిగిన నియోజక వర్గాల నేతలకు నేరుగా ఫోన్ చేస్తున్న సీఎం కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త అంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నట్టు సమాచారం. పెద్ద సార్ నుంచి ఫోన్‌ రావడంతో అభ్యర్థులు, ఇంఛార్జ్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట.

తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూనే దిశ నిర్దేశం చేస్తున్నారంట కేసీఆర్. ఓ వైపు‌సుడిగాలి పర్యటనల్లో పాల్గొంటునే మరో వైపు సొంత పార్టీ అభ్యర్థులకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారంట. తాజాగా నిర్మల్ జిల్లా లో ప్రజా ఆశీర్వాద సభల అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు అభ్యర్థులకు ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీయడంతో పాటు ఎక్కడ లోపం ఉంది ఏ గ్రామం ఏ మండలంలో పరిస్థితి ఎలా ఉందో తనే చెప్తుండటంతో షాక్ అవుతున్నారంట అభ్యర్థులు. ఇంచార్జ్ లుగా వచ్చిన నేతలకు సైతం గట్టిగానే క్లాస్ ఫీకుతున్నారంట పెద్దాయన.

తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేతలకు ఫోన్ లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అలసత్వం వీడకపోతే మోసపోతామంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారంట. రెండు‌ నెలలుగా అసమ్మతిని చక్కదిద్దుకోలేక పోయారా అంటూ క్లాస్ పీకుతున్నారంట. మాట్లాడేది రెండు మూడు నిమిషాలే అయినా పెద్దాయన నుండి వస్తున్న ఆ కాల్ అభ్యర్థుల ను హైరానాకు గురి చేస్తుందంట. మరో వైపు హరీష్ రావు , కేటీఆర్‌ల నుంచి వస్తున్న ఫోన్లు సైతం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయంట. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల పనితీరు, ప్రజల నాడి ఎలా ఉందనే దానిపై స్వయంగా సీఎం కేసీఆర్ ఆరా తీయడం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ల ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రజా ఆశీర్వాద సభల కంటే ముందు, తర్వాత నియోజకవర్గాల వారీగా సీఎం తన దగ్గర ఉన్న సమాచారంతో సమీక్షించడం నేతలను హైరానాకు గురిచేస్తుందంట. కలిసికట్టుగా పని చేయకుంటే కష్టమనే సంకేతం మూడు నాలుగు నియోజక వర్గాల నేతలకు ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు శాసనసభ స్థానాల్లో.. నాలుగు నియోజవర్గాల్లో పరిస్థితి మరింత కష్టంగా ఉందని.. అసమ్మతిని ఎందుకు తగ్గించుకోలేక పోతున్నారు.. మీ ఈగోలు ఎందుకు పక్కన పెట్టలేక పోతున్నారంటూ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిపక్షాల అసమ్మతిని ఎలా అనుకూలంగా మార్చుకోవాలో.. నిరాశతో ఉన్న పక్క పార్టీల కీలక నేతలను ఎలా తమ వైపు తిప్పుకోవాలో ఎక్కడ ఏనేత ఎలా ఆశతో ఉన్నాడో పూస గుచ్చినట్టు చెప్తుండటంతో షాక్ అవుతున్నారంట అభ్యర్థులు. ఓ వైపు సుడిగాలి‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటునే మరో వైపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారంట కేసీఆర్.

ప్రధానంగా ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల ప్రచారశైలిపై సీఎం దృష్టి సారించి అతి విశ్వాసానికి వెళ్లకూడదని సుతి మెత్తగా హెచ్చరించనట్టు సమాచారం. మంచిర్యాల, బెల్లంపల్లి లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని.. సెట్ చేసుకోకపోతే కథకంచికే అంటూ గట్టిగానే చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. సిట్టింగ్ సీట్లు మార్చిన ఆసిపాబాద్ , బోథ్ , ఖానాపూర్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు అత్యుత్సహం అసలుకే ఎసరు తెచ్చేలా ఉందని.. అసమ్మతి ని‌ కట్టడి చేయడంలో ఇంఛార్జ్ లు సైతం విఫలం అవడంతో కీలక శ్రేణుల నుంచి అనుకున్నంత సహకారం అందడం లేదనే విషయం సీఎం దృష్టికి వెళ్లగా.. ఈ విషయంపై అభ్యర్థులకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రేణులకు సైతం అదిష్టానం నుంచి ఫోన్లు వస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆ టెన్షన్ మరింత పెరిగినట్టే తెలుస్తోంది. ఫోన్ మోగడమే ఆలస్యం అమ్మో హైకమాండ్ ఫోనా అంటూ హైరానా పడిపోతున్నారంట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..