
హమ్మయ్యా.. మంచిరోజులొచ్చాయి.. జాబితా, మేనిఫెస్టో, బీఫారాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి పార్టీలు.. ఎన్నికల రణంగంలోకి ప్రధాన పార్టీలు దూకేస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ విడుదలైనా.. మూఢాలు ఉండటంతో మంచిరోజుల కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశాయి ప్రధానపార్టీలు. ఛానాళ్ల క్రితమే జాబితా ప్రకటించి అన్ని పార్టీలకన్నా ముందున్న బీఆర్‌ఎస్..
అసలు సమరంలోకి దిగబోతోంది. ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలను ఇవ్వనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్.. ఇవాళ సాయత్రం 4 గంటలకు హుస్నాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ పెద్దలతో కలిసి కసరత్తు చేసిన టీ కాంగ్రెస్ నేతలు, తర్జనభర్జన తర్వాత 55మంది పేర్లతో ఏఐసీసీ జాబితా విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. లెఫ్టు పార్టీలతో పొత్తుపై కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీపీఐకి రెండు సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఇక మొదటి నుంచి మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్న బీజేపీ కూడా సోమవారం మొదటి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై..తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, లిస్టు ఫైనల్ చేయనుంది. అటు ఇవాళ్టి నుంచే కమలం పార్టీ జాతీయనేతలు ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. ముషీరాబాద్‌లో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పర్యటించనున్నారు.
సోమవారం హుజురాబాద్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెళ్తున్నారు. జమ్మికుంట, బడంగ్‌పేట్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు. కడ్తాల్, కల్వకుర్తిలో జరిగే సభలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి నేటి నుంచే అసలు..సిసలైన తెలంగాణ దంగల్ మొదలుకానుంది…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..