Tarun Chug: తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్ట రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో తెలంగాణ రామరాజ్య స్థాపన జరగబోతోందని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర డప్పుల ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేసి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు.
హైదరాబాద్‌లో తమ ప్రభుత్వం ఉందని సీఎం మిడిసిపడుతున్నారని.. వీరిపైన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని హెచ్చరించారు తరుణ్ చుగ్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలదేనన్నారు.