
Telangana Elections: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కీలక వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చిన బీజేపీ అధిష్ఠానం.. కాస్త ఆలస్యమైనా పక్కాగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తోంది. నిజామాబాద్‌కి పసుపుబోర్డు, ములుగుకి ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేసి తెలంగాణ ప్రజలను మెప్పించే ప్రయత్నంచేసింది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ రెండుజిల్లాల పర్యటనలకు వచ్చి ఈ ప్రకటనచేయడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి కమలం శ్రేణులు. తెలంగాణకు కేంద్రం అన్యాయంచేస్తోందన్న బీఆర్‌ఎస్ వాదనని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ. తొమ్మిదేళ్లలో పదిలక్షలకోట్లు తెలంగాణకు ఇచ్చామన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కృష్ణాజలాల వాటాను తేల్చేందుకు ట్రిబ్యునల్ నియామక ప్రకటనతో మరో అడుగు ముందుకేసింది బీజేపీ.
మధ్యలో తెలంగాణ బీజేపీలో కొంత గందరగోళం జరిగినా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తీసుకొచ్చి అన్నీ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉంది కమలంపార్టీ. సీనియర్లతో పాటు పాతకొత్త నేతలందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం మొదలైంది. ఎన్నికలకోసం పద్నాలుగు కమిటీలతో.. అసంతృప్తనేతలందరికీ పెద్దపీట వేసింది బీజేపీ అగ్రనాయకత్వం. అగ్రనేతల పర్యటనలతో దూకుడు పెంచబోతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శల డోసు పెరగబోతోంది. మోదీ మొన్నటి పర్యటనతోనే బీఆర్‌ఎస్‌పై ఆ పార్టీనుంచి గట్టి ఎదురుదాడి మొదలైనట్లయింది.
ఐదురాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణకి ఆఖర్న ఎన్నికలు జరగబోతుండటంతో.. చివరి వారంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించే వ్యూహంతో బీజేపీ ఉంది. అభ్యర్థులకోసం గట్టి కసరత్తు చేస్తున్న బీజేపీ.. క్యాండేట్లు లేరన్న లోటు రాకుండా సీనియర్‌నేతలంతా ఎమ్మెల్యేలుగా పోటీచేయాల్సిందనే కండిషన్ పెట్టింది. దీంతో సీనియర్లంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబపాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.. మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. రెండో స్థానం కోసమో, మూడో స్థానం కోసమో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీ పడాలన్నారు. అమరవీరుల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ గౌరవించలేదని.. ఉద్యమద్రోహులంతా ప్రగతిభవన్‌లో చేరారంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..