Telagana BJP: ఫుల్ టు ఫుల్ క్లారిటీ.. ధరణి పోర్టల్‌నే కాదు, బీఆర్‌ఎస్ పోర్టల్‌నీ మూసేస్తాం.. నాగర్‌కర్నూల్ సభలో సౌండ్‌ పెంచిన నడ్డా..

|

Jun 25, 2023 | 8:38 PM

JP Nadda: తెలంగాణా బీజేపీలో మొన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి... బాటిల్‌లో షాంపేన్‌లా గబుక్కున పైకి పొంగేసింది. ఇలాగైతే మేం ఉండలేం అంటూ కర్చీఫ్ విదలగొట్టి లేచిపోడానికి రెడీ అయ్యారు కొందరు కీలక నేతలు. బీఆర్‌ఎస్‌తో చేసే పోరాటంలో మైమేతే అలసిపోలేదు.. మీరెందుకు సొమ్మసిల్లిపోయారు అంటూ డైరెక్ట్‌గా అధిష్టానాన్నే అడిగేస్తున్నారు. కొందరైతే కడిగేస్తున్నారు. కానీ... మీకు తోడుగా మేముంటాం... కలిసే పోరాడదాం... అంటూ భరోసానిస్తోంది హైకమాండ్. మరి... ఎత్తర జెండా అంటూ జోష్ నింపుతున్న బిగ్‌బాస్‌ల మాటలు... అసంతృప్తుల్ని బుజ్జగిస్తాయా?

Telagana BJP: ఫుల్ టు ఫుల్ క్లారిటీ.. ధరణి పోర్టల్‌నే కాదు, బీఆర్‌ఎస్ పోర్టల్‌నీ మూసేస్తాం.. నాగర్‌కర్నూల్ సభలో సౌండ్‌ పెంచిన నడ్డా..
Bjp
Follow us on

తెలంగాణా బీజేపీలో మళ్లీ జోష్‌ నింపింది బీజేపీ నేషనల్ బాస్ నడ్డా టూర్. బీఆరెస్సే టార్గెట్‌గా యుద్ధం కంటిన్యూస్ అని స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చారు జేపీ నడ్డా. కేసీఆర్‌ను దించుడే మన లక్ష్యం అంటూ పార్టీలోని తస్మదీయులకు, అస్మదీయులకు సింగిల్ పాయింట్ ఎజెండా ఇచ్చి వెళ్లారు. మరి… నడ్డా పర్యటనతో తెలంగాణా బీజేపీ కుదుట పడినట్టేనా? అసమ్మతి గళమెత్తి.. పార్టీ లోపలా బైటా లేనిపోని సందేహాలకు తావిస్తున్న ఆ డబుల్ ఆర్లు… రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి… తాడోపేడో రేంజికొచ్చేశారు. కొన్నాళ్ల నుంచి ఓపెన్ స్టేట్‌మెంట్లతో సొంత పార్టీని ఇరకాటంలో పెట్టిన వీళ్లిద్దరూ శనివారం నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్‌షా దగ్గర సిట్టింగ్ వేశారు. కిషన్‌రెడ్డితో కలిసి ఇద్దరూ దాదాపు మూడున్నర గంటలు చర్చించారు. తెలంగాణా ప్రభుత్వం తరఫున ఢిల్లీకొచ్చిన కేటీఆర్‌కి దొరకని అమిత్‌షా అపాయింట్‌మెంట్.. పార్టీ నేతలకి దొరికిందంటే… టీ-బీజేపీలో సీన్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పడిపోయినట్టు కనిపిస్తోందని.. కర్నాటక ఫలితాల తర్వాత టీ-కాంగ్రెస్‌లో జోష్ పెరిగిందని.. దీనికి తోడు… బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందనే సందేహం జనంలో కలిగిందని… అధిష్టానం దగ్గర ఏకరువు పెట్టారు ఆర్ అండ్ ఆర్.

మనం అనుకున్నదేంటి… మనం చేస్తున్నదేంటి… మనకే క్లారిటీ లేకపోతే జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లవా… అదే మా భయం అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. సందేహాలన్నీ తుడిచిపెట్టుకుపోవాలంటే తెలంగాణా ప్రజానీకానికి మనమేదైనా స్పష్టమైన సంకేతాన్నివ్వాలని సూచించారు. కవిత పేరు చార్జ్‌షీట్‌లో ఉన్నా అరెస్టు చెయ్యడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటూ అమిత్‌షాను సూటిగా అడిగినట్టు కూడా తెలుస్తోంది. కానీ.. మై హూనా అనే ఓదార్పు మాటలే తప్ప నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ ఏదీ ఇచ్చినట్లు లేదు అధిష్టానం. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే తీరాలి.. అదే పోరాట పటిమ, అదే స్పూర్తితో నడవాలి.. వెనకడుగెయ్యొద్దు అని సున్నితంగా ఉపదేశమిచ్చి పంపారు బిగ్‌ బాస్.

పార్టీలో ఏర్పడ్డ అనిశ్చితిని, స్తబ్దతను తొలగించడం కోసం హైకమాండ్‌ నుంచి కసరత్తు మాత్రం జరుగుతూనే ఉంది. మోదీ సర్కారు ద్వారా తెలంగాణా రాష్ట్రానికి ఏమేం దక్కింది, ఎన్నెన్ని నిధులొచ్చాయి… డీటెయిల్డ్‌గా వివరిస్తూ ఇటీవలే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. మొన్న ఏపీలో పర్యటించి అధికారపార్టీని ఎక్కితొక్కేసిన జేపీ నడ్డా… ఇవాళ తెలంగాణా టూరేశారు. నాగర్‌కర్నూల్ నవసంకల్ప సభే వేదికగా బీఆర్‌ఎస్ మీద బాణాలు ఎక్కుపెట్టారు. బీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాల్లాంటివేమీ లేవని చెప్పకనే చెప్పారు నడ్డా.

కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి బాగోతాల్ని ఎండగడదాం.. తెలంగాణాలో బీఆర్‌ఎస్‌కి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాం… పనిచేసుకుంటూ పోదాం…. అంతే తప్ప నిరుత్సాహంతో పార్టీ వదిలి పోవద్దు… అంటూ పార్టీ నేతలకు భరోసానిచ్చారు. స్థానిక మేధావులతో భేటీ అవుతూ, పార్టీ గమనాన్ని మనుగడనూ ఆరా తీస్తున్నారు. పార్టీలో అసమ్మతి ఉందని పరోక్షంగా అంగీకరిస్తూనే, డ్యామేజ్ కంట్రోల్ కోసం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ కూడా బీఆర్‌ఎస్‌ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. చీకటి ఒప్పందం మాతో కాదు కాంగ్రెస్ పార్టీతోనే అంటూ కుండబద్దలు కొడుతూనే ఉన్నారు.

తెలంగాణాలో గాడి తప్పిన పార్టీని, పట్టాలెక్కించడానికి అన్ని శక్తుల్నీ ఒడ్డుతోంది బీజేపీ. ఢిల్లీ నుంచి అమిత్‌షా, నాగర్‌కర్నూల్ నవసంకల్ప సభ వేదిక మీద జేపీ నడ్డా… లోకల్ కమలం లీడర్లకు బూస్ట్‌ నిచ్చే ప్రయత్నం చేశారు. తాజా పరిణామాలు టీ-బీజేపీ నేతల్ని ఒక్కతాటి మీదకు తీసుకొస్తాయని, పక్క చూపులు చూస్తున్న కీలక నేతలు దారికొచ్చినట్టేనని క్యాడర్ ఆశిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం