
బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్.. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై కీలక వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ భావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఈవెంట్ లో హనుమంతుడిపై రాజమౌళి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన ప్రవీణ్, “హిందూ ప్రేక్షకులు నీ సినిమాలను ఆదరించకపోతే నువ్వెక్కడ నిలబడతావో ఒక్కసారి ఆలోచించు” అని రాజమౌళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవుణ్ని నమ్మకపోవడం వ్యక్తిగత నిర్ణయం కావొచ్చు, కానీ దేవతల గురించి అభాసుపాలు చేసే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు చికోటి ప్రవీణ్.
తన ప్రతి చిత్ర ప్రారంభోత్సవాన్ని పూజలతో మొదలెడుతూ, దేవుళ్ల కథల ఆధారంగా భారీ విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు.. ఇప్పుడు దేవుళ్లకు విరుద్ధంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ వైఖరే ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందని పేర్కొన్నారు. రాజమౌళి అహంకారంతో ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని చికోటి ప్రవీణ్ విమర్శించారు. “మీ బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్ర ఎలా తన అహంకారంతో చివరికి పడిపోయాడో చూపించావు.. అలాంటి గర్వ భావన నీలోకి రాకూడదు. అదే దారిలో నడిస్తే పరిణామాలు మంచిగా ఉండవు” అని హెచ్చరించారు.
హిందూ సమాజం మనోభావాలను కించపరిచే ధోరణి ఎవరిదైనా సహించేది లేదని ప్రవీణ్ చెప్పారు. రాజమౌళి వెంటనే హిందూ సమాజానికి స్పష్టమైన వివరణ లేదా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.