Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. మంగళవారం పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చిన కమలం పార్టీ రాజగోపాల్ రెడ్డిలోని అసంతృప్తిని చల్లార్చేందుకు జాతీయ కార్యవర్గంలో ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా బీజేపీ నాయకత్వం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే.
అయితే పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నిన్న భేటీ అయ్యారు. అప్పుడు వారిద్దరూ ఏం చర్చించారన్నది తెలియకున్నా, పార్టీ మారే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నారని మాత్రం ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసి ఆయనలో పార్టీ మార్పు ఆలోచన రాకుండా జాగ్రత్త పడింది.
కాగా, మంగళవారం జేపీ నడ్డా నేతృత్వంలోని కమలం పార్టీ చేపట్టిన రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పులో భాగంగా ఏపీ, తెలంగాణలో కూడా మార్పులు చేసింది. తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇంకా ఈటెల రాజేందర్‌ని తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.