BJP List: బీజేపీ తొలి జాబితా ప్రకటన.. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆ ఐదుగురు నేతలకు బీజేపీ టిక్కెట్లు

|

Mar 03, 2024 | 8:21 AM

సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో తొలి పావును కదిపింది భారతీయ జనతా పార్టీ. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. యువతకు ప్రాధాన్యత ఇస్తూ.. బీసీలు, మహిళలను చేర్చుకుంటూ తన జాబితాను రిలీజ్‌ చేసింది. ఈసారి 400కి పైగా సీట్లే టార్గెట్‌గా బీజేపీ పనిచేస్తోంది.

BJP List: బీజేపీ తొలి జాబితా ప్రకటన.. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆ ఐదుగురు నేతలకు బీజేపీ టిక్కెట్లు
Bjp Mp List
Follow us on

సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో తొలి పావును కదిపింది భారతీయ జనతా పార్టీ. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. యువతకు ప్రాధాన్యత ఇస్తూ.. బీసీలు, మహిళలను చేర్చుకుంటూ తన జాబితాను రిలీజ్‌ చేసింది. ఈసారి 400కి పైగా సీట్లే టార్గెట్‌గా బీజేపీ పనిచేస్తోంది.

మరికొన్ని రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమర శంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.

ఈ 9 మంది పేర్లలో 5 మంది అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, పోతుగంటి భరత్, బీబీ పాటిల్. గతంలో ఈ ఐదుగురు అభ్యర్థులు భారత రాష్ట్ర సమితితో క్రియాశీలకంగా వ్యవహారించారు. బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈ ఐదుగురు తొలి జాబితా ప్రకటించిన తొమ్మిది మందిలో చోట సంపాదించుకోవడం ఆసక్తికరంగా మారింది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో గులాబీ పార్టీని వీడి భారత జాతీయ కాంగ్రెస్‌లోకి మారారు. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, చివరకు అదే సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి BRS పార్టీ తరుఫున పోటీ చేసి 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. మరోసారి రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తరుఫున బరిలో దిగుతున్నారు. న్యూ ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ సభ్యుడిగా విశ్వేశ్వర్ రెడ్డి పనిచేసిన భారత న్యాయవ్యవస్థలో ప్రముఖ వ్యక్తి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ అనుభవజ్ఞుడైన కెవి రంగా రెడ్డి మనవడు. రంగారెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారు. హైదరాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కొండా మాధవ రెడ్డి తనయుడే విశ్వేశ్వర రెడ్డి. 528 కోట్ల ఆస్తులతో 2014 – 2019 మధ్యకాలంలో తెలంగాణ నుండి అత్యంత ధనిక ఎంపీగా ఉన్నారు. అతను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి అల్లుడు. అతని భార్య సంగీత రెడ్డి అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

విశ్వేశ్వర్ రెడ్డి ఒక విజయవంతమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు. ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో పాలుపంచుకున్న సిటాడెల్ రీసెర్చ్ & సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకుడు. అనేక IPRల సృష్టిలో పాల్గొన్నారు. ఒక ప్రొఫెషనల్‌గా,జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ GE MSIT CEO, మేనేజింగ్ డైరెక్టర్‌గా, Wipro HCIT విప్రో CEO, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఈటల రాజేందర్

ఒకప్పుడు బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుకు కుడిభుజంగా పేరుగాంచిన ఈటల రాజేందర్ పార్టీ సీనియర్ నాయకులు కేటీ రామారావు, టి హరీష్ రావులతో పాటు గులాబీ పార్టీ హైకమాండ్‌లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించిన రెండేళ్ల తర్వాత 2003లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో 2014 నుండి 2018 వరకు ఆర్థిక మంత్రిగా, తరువాత 2019 నుండి 2021 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. మే 2021లో మెదక్ జిల్లాలోని అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలలో భూ ఆక్రమణల ఆరోపణలను ఈటల ఎదుర్కొన్నారు. ఆయనను కేసీఆర్ మంత్రి పదవి నుండి తొలగించారు. తరువాత జూన్ 4 న BRS పార్టీకి రాజీనామా చేసిన ఈటెల భారతీయ జనతా పార్టీలో చేరారు. అనేక అంశాలపై వివిధ వేదికలపై కేసీఆర్‌పై రాజేందర్‌ బహిరంగంగా విభేదించిన తర్వాత అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.

2021లో హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో పోటీ చేసి కేసీఆర్‌ను గజ్వేల్‌లో సవాలు చేశారు. అయితే రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ చేతిలో ఓడిపోయారు. ముదిరాజ్ సంఘం (బీసీ) నాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లోని మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు.

బూర నర్సయ్య గౌడ్

2009లో భారత రాష్ట్ర సమితిలో చేరిన బూర నర్సయ్య గౌడ్, 2014 ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణలో బలమైన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్, 15 అక్టోబర్ 2022న BRS కి రాజీనామా సమర్పించారు. 19 అక్టోబర్ 2022 న BJP లో చేరారు. వృత్తిరీత్య వైద్యులైన బూర లాపరోస్కోపిక్, ఊబకాయం, జీర్ణాశయాంతర సర్జన్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదకుడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) సభ్యుడుగా కొనసాగారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాపరోఎండోస్కోపిక్ సర్జరీ (HILS) డైరెక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్‌లో సేవలు అందిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై తనను సంప్రదించలేదని, పార్టీ ఎజెండా గురించి తనకు తెలియదని పేర్కొంటూ పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2022లో బీఆర్‌ఎస్‌ నుంచి వైదొలిగారు. ఇక తాజాగా బీజేపీలో చేరిన ఆయన భువనగిరి నుండి లోక్‌సభ ఎన్నికలకు మరో పోటీకి సిద్ధమవుతున్నారు.

పోతుగంటి భరత్

నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్‌ తన తండ్రితో కలిసి బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాను ప్రకటించడానికి రెండు రోజుల ముందే బీజేపీలో చేరారు. అదే స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలకు రాములుకు బదులుగా భరత్‌ పేరును కాషాయ పార్టీ ప్రతిపాదించింది. భరత్ బీఆర్ఎస్ పార్టీ మారక ముందు యువ నాయకుడిగా పనిచేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాములు జిల్లాలో పలుకుబడి కలిగి ఉన్నారు. ఆయన కుమారుడు అదే స్థానం నుండి రాబోయే లోక్‌సభ ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్నారు.

కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన రాములు 1994లో రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కెరీర్‌ ప్రారంభించారు. అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1994, 1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, టిడిపి నుండి బిఆర్ఎస్‌లోకి మార్చారు. 2019 లోక్ సభ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నుండి విజయం సాధించారు.

బీబీ పాటిల్

పోతుగంటి రాములు, ఆయన కుమారుడు చేరిన వెంటనే జహీరాబాద్‌ నుంచి రెండుసార్లు పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ మార్చి 1న భారతీయ జనతా పార్టీలో చేరారు. గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ తరుఫున జహీరాబాద్ పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు బీబీ పాటిల్. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి నాటి టీఆర్ఎస్, తాజాగా బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత ఆయనతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు.

ఇక అభ్యర్థుల కోసం పార్టీ ఎంపిక ప్రక్రియలో కుల సమీకరణాలు, అంతర్గత సర్వేలు, అభ్యర్థుల గెలుపోటము వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణాలో కనీసం 10 లోక్‌సభ స్థానాలను సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలో పార్టీ ఉనికిని విస్తరించాలనే బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది. బిజెపి తన ఎన్నికల లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు, రోడ్‌షోల ద్వారా ఓటర్లకు దగ్గరయ్యేందుకు చురుకుగా పాల్గొంటోంది. అట్టడుగు స్థాయి ప్రజలతో మమేకం కావడం, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం, రాబోయే ఎన్నికల్లో వారి మద్దతు కోరడం లక్ష్యంగా ఈ ఔట్ రీచ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..