Gouravelli refugee issue: గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలపై బీజేపీ (BJP) నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. నిర్వాసితులపై పోలీసులు వ్యవహరించిన తీరును బండి సంజయ్, పలువురు నేతలు గవర్నర్‌కు వివరించారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) ను కలిసిన బీజేపీ నేతలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయబద్ధంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు అర్ధరాత్రి దారుణంగా దాడి చేశారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలను గవర్నర్‌కు తెలిపామని పేర్కొన్నారు.
చట్టప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారని.. ఆందోళన చేస్తున్న వారిపై కావాలనే దాడి చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి పోలీసులు ప్రతి ఇంటిపైనా పడి మహిళలు, వృద్ధులు, చిన్నారులు అని కూడా చూడకుండా లాఠీలతో కొట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళలకు తీరని అవమానం జరిగిందని.. అక్కడి పరిస్థితి గురించి గవర్నర్‌కు వివరించామని సంజయ్ తెలిపారు.
దీంతోపాటు రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఇబ్బందుల గురించి కూడా గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు సంజయ్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..