September 17th Celebrations Live: ఓవైపు జాతీయ సమైక్యత.. మరోవైపు విమోచన ఉత్సవాలు.. తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు
TRS, BJP, Congress Celebrations Live Updates: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
TRS, BJP, Congress Celebrations Live Updates: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు జరిగాయి. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ.. 75వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నరకు పబ్లిక్‌గార్డెన్‌లో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లా కేంద్రాల్లో జెండా వందనం చేస్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 44 కోట్లతో నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజనులతో భారీ ర్యాలీ జరుగుతుంది. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
అటు బీజేపీ కూడా గట్టిగానే ప్లాన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం జరిపై తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు హోంమంత్రి అమిత్‌షా. ఈ కార్యక్రమానికి తెలంగాణతోపాటు.. వివిధ రాస్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి.. అక్కడికి వెళ్లే అవకాశం లేదు. ఇక మహారాష్ట్ర కర్నాటక సీఎంలు హైదరాబాద్ రాబోతున్నారు. రాత్రి శంషాబాద్‌లో ల్యాండైన కేంద్ర హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈరోజు జరిగే అధికారకి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మరో వైపు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. గాంధీ భవన్‌లో జరిగే ఈ ఉత్సవాలను టీ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి ప్రారంభించి జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిపిన పోరులో ప్రధాన సూత్రదారులైన కమ్యూనిస్టులు సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 9.30 గంటలకు కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకంటే ముందు 7.10 గంటలకు చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించనుంది.
LIVE NEWS & UPDATES
-
భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తుడి లక్ష్యం: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ సమైక్యతా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన మంత్రి.. సమైక్యత అంటే భౌగోలికమైంది కాదన్నారు. సమైక్యత అంటే భిన్న సంస్కృతులు, ప్రజల మధ్య సమైక్యత అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తుడి లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి @KTRTRS జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.#HyderabadIntegrationDay pic.twitter.com/wRMpbLXHM6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 17, 2022
74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of Telangana into Indian union
Today A Union Home Minister has come to DIVIDE & BULLY The People of Telangana & their state Govt
That’s why I say, India needs DECISIVE POLICIES Not DIVISIVE POLITICS
— KTR (@KTRTRS) September 17, 2022
-
తెలంగాణ ఉభయ సభల్లో అంబరాన్నంటిన జాతీయ సమైక్యతా వేడుకలు..
తెలంగాణ శాసనసభలో జాతీయ సమైక్యతా వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. తెలంగాణ శాసనమండలిలోనూ సమైక్యతా వేడుకలు అంబరాన్నంటాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంటన పలువురు ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
-
-
పెన్షన్లు ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ.. సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు: టీఆర్ఎస్
తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీపై రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు పెన్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన బీజేపీ.. ఇవాళ సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యింది. ఈ మేరకు ట్వీట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు పెన్షన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకించిన బీజేపీ పార్టీ… ఇవ్వాళ సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. pic.twitter.com/u0XDhmNHmc
— TRS Party (@trspartyonline) September 15, 2022
-
తెలంగాణ శాంతి, సౌభాగ్యాలతో ఉండాలి.. అశాంతి, అలజడులతో కాదు: కేసీఆర్
దేశంలో మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలీనం చేసే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రగిలిస్తున్నారన్నారు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప, అశాంతి, అలజడులతో కాదని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
-
జునాఘడ్‌ను కలిపింది కూడా సర్దార్ పటేలే.. అక్కడెందుకు చేయట్లేదు వేడుకలు: రేవంత్
బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘గుజరాత్‌లోని జునాఘడ్‌ను 1948లో దేశంలో విలీనం చేశారు. అది చేసింది కూడా పటేల్. అక్కడ బీజేపీ విమోచన అమృత్ ఉత్సవాలు చేస్తుందా? ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. నరేంద్ర మోదీ ఆదేశాలతో సెప్టెంబర్ 17 వేడుకలు చేస్తున్నారా? లేదా?’ అని ప్రశ్నించారాయన.
-
-
తెలంగాణ జాతికి స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి
తెలంగాణ సమాజానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తమ పునాదులు వేసిందే మహనీయుడు సర్దార్ పటేల్ అని అన్న రేవంత్.. బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘చరిత్రే లేని కొందరు చరిత్ర హీనులు, మా చరిత్రలో కొంత భాగాన్ని దొంగిలించి తమ చరిత్రగా చూపించుకునే ప్రయత్నం చేయడం హేయం’ అని దుయ్యబట్టారు.
నా తెలంగాణ జాతికి స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు.
మా పునాదులు వేసిందే మహానీయుడు “సర్దార్” పటేల్…
చరిత్రే లేని కొందరు చరిత్రహీనులు, మా చరిత్రలో కొంత భాగాన్ని దొంగిలించి తమ చరిత్రగా చూపించుకునే ప్రయత్నం చేయడం హేయం.#TG pic.twitter.com/jslKUhvhte
— Revanth Reddy (@revanth_anumula) September 17, 2022
-
గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ నేతలు..
గాంధీ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కీలక నేతలు శ్రీధర్ బాబు, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనర్సింహం తదితరులు పాల్గొన్నారు.
-
సిద్దిపేటలో మిన్నంటిన సమైక్యతా వేడుకలు.. జాతీయజెండాను ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లాలో జాతీయసమైక్యతా వేడుకలు అంబరాన్నంటాయి. డిగ్రీ కాలేజీ దగ్గర మంత్రి హరీశ్‌రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. సమైక్యతా వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సంప్రదాయ వస్త్రాలంకరణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. సమైక్యతా వేడుకలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇవాళ జాతీయ సమైక్యతా దినం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి హరీశ్‌రావు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సమైక్యస్ఫూర్తిని చాటేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి. సమైక్యతా వేడుకలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.
Live form Siddipet: Telangana Jateeya Samaikyata Dinotsavam https://t.co/1aS2RjoGYs
— Harish Rao News (@TrsHarishNews) September 17, 2022
-
తెలంగాణ సమాజాన్ని చీల్చే కుట్ర..: కేసీఆర్
తెలంగాణ ప్రజలను ఏకం చేసి 14ఏళ్లు పోరాటం చేశాననని సీఎం కేసీఆర్ అన్నారు. చిమ్మచీకట్లను చీల్చుకుంటూ తెలంగాణ పురోగమిస్తూ.. నేడు దేశానికే టార్చ్ బేరర్‌గా మారిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833కు పెరిగిందని, 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధి రేటు 26 శాతానికి పెరిగిందన్నారు. కర్నాటకను మించి ఐటీ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. మతతత్వ శక్తులు తెలగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఏమరపాటు వల్ల 50 ఏళ్లు కష్టపడ్డామని, మళ్లీ అలాంటి తప్పు చేస్తే కోలుకోలేని దెబ్బ పడుతుందన్నారు సీఎం కేసీఆర్.
-
త్యాగాలతో చరిత్రను వెలిగించారు: సీఎం కేసీఆర్
1948లో దేశంలో అంతర్భాగమైన తెలంగాణ.. నేడు దేశానికే టార్చ్ బేరర్‌గా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిజాం పాలన అంతమై హైదరాబాద్ రాజ్యం దేశంలో అంతర్భాగమైన 75 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. 1948లో తెలంగాణ దేశంలో అంతర్భాగమైందని పేర్కొన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి స్వేచ్ఛ వైపు పయనించిందన్నారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య సాహసాలు మరువలేనివని వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారని, తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రత్యక్ష ప్రసారం. #TelanganaIntegrationDay https://t.co/1NVZ7qktjv
— Telangana CMO (@TelanganaCMO) September 17, 2022
-
పబ్లిక్ గార్డెన్స్‌తో జాతీయ సమైక్యతా దినోత్సవం..
పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
-
ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇన్నాళ్లు నిర్వహించలేదు: అమిత్ షా
నిజాం రాజ్యంలో తెలంగాణలో అరాచకాలు కొనసాగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అలాంటి అరాచకాలను చెక్ పెట్టింది పటేల్ అని అన్నారు. అయితే, ప్రస్తుత నాయకులు ఓటు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలు జరుపలేదని ఆరోపించారు అమిత్ షా. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయన్నారు.
-
తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ విముక్తికి మరింత సమయం పట్టేదన్నారు. పటేల్ చొరవతో పోలీస్ చర్య తీసుకోవడం వల్లే విముక్తి సాధ్యమైందన్నారు. సర్దార్ పటేల్‌కు వేలవేల వందనాలు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలంటే ఇప్పటికీ కొందరు భయపడుతున్నారని విమర్శించారు అమిత్ షా. ఏ భయం లేకుండా వేడుకలు చేసుకోవాలని కోరుతున్నామన్నారు.
-
అమిత్ షా పర్యటనలో కారు కలకలం.. కాన్వాయ్‌కి అడ్డొచ్చిన కారు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఓ కారు కలకలం సృష్టించింది. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్‌కు ఓ కారు అడ్డు వచ్చింది. కారు ఎంతకీ పక్కకి తీయకపోవడంతో.. వెనుక అద్దం పగలగొట్టారు అమిత్ షా భద్రతా సిబ్బంది. ఈ ఘటన తీవ్ర కలకం రేపుతోంది.
-
Traffic Restrictions: హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Restrictions: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఆమల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి 2,300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానీకం వస్తారని భావిస్తున్నారు. అందువల్ల నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు పోలీసులు.
-
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న అమిత్ షా..
Amit Shah Speech in Hyderabad Liberation Day celebrations
Amit Shah Speech at Parade Grounds in Hyderabad Live:
-
అమరులకు నివాళులర్పించిన అమిత్ షా..
కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణలో విమోచన దినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు శోభాయమానంగా మారాయి. పోలీసుల కవాతులు, వీవీఐపీల రాక, కళాకారుల నృత్యాలతో విమోచన వేడుకలు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్రం హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకంలో సంతకం చేసి సందేశాన్ని రాశారు. అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
It was the police action by Sardar Patel that led to the liberation of Hyderabad. From 13th September to 17th September for 109 hours, many braves sacrificed their lives.
– Shri @AmitShah pic.twitter.com/CB2whCL0eh
— BJP (@BJP4India) September 17, 2022
-
మూడు రాష్ట్రాల కళారూపాలతో హోరెత్తుతున్న పరేడ్ గ్రౌండ్స్..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న వేడుకల్లో కళాకారులు నృత్యాలతో అలరిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రదర్శనలు ఇచ్చారు. మూడు రాష్ట్రాల కళారూపకాల ప్రదర్శనతో పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు మార్మోగాయి. డప్పుదరువులు, ఒగ్గు కథలతో కళాకారులు హోరెత్తించారు.
-
తెలంగాణ వ్యాప్తంగా సమైక్యతా వజ్రోత్సవాలు..
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
-
అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా: కిషన్ రెడ్డి
1948లో నిజాంను ఓడించి జాతీయ జెండాను గర్వంగా ఎగురవేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 1948లో సర్దార్ పటేల్ జెండా ఎగురవేస్తే.. 74 ఏళ్ల తరువాత అమిత్ షా జెండా ఎగురవేశారన్నారు. అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా అని కొనియాడారు కిషన్ రెడ్డి. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 25 ఏళ్ల నుంచి ఈ వేడుకలు నిర్వహించాలని చూస్తున్నామన్నారు. ఇన్ని రోజులు ఈ వేడుకల్ని ఎందుకు నిర్వహించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పోరాటంతోనే ఈ విమోచన దినోత్సవాలు జరుపుతున్నారని అన్నారు.
-
పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాగా, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ వేడుకల్లో 3 రాష్ట్రాలకు చెందిన కళానృత్యాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు.
-
పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాం..
పరేడ్ గ్రేండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ రోజు విమోచన దినోత్సవమే పునరుద్ఘాటించారు. విమోచన దినోత్సవం జరపక పోవడం తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని అన్నారు. చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తే లేదన్నారు. దారుసలాంలో నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినోత్సవం జరుపుతోందని ఆరోపించారు బండి సంజయ్. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు చేస్తుందన్నారు. ఒవైసీ కుటుంబానికి కేసీఆర్ దాసోహం అయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జెండా ఎగురవేయాలని ఆదేశాలు ఇవ్వకుండా.. సెలవు ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు.
-
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళులర్పించాలి: వెంకయ్య నాయుడు
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం తరువాత, 500 పైగా రాచరిక రాష్ట్రాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని అందుకు అందరూ ఆయనకు ఘన నివాళి అర్పించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం కబంధహస్తాల్లోనే చిక్కుకుందని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోలీస్ చర్య వల్ల ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వివాదాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలనివెంకయ్య నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు.
-
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు..
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ @bandisanjay_bjp
ఈ కార్యక్రమంలో పాల్గొన్న @BJP4India ప్రధాన కార్యదర్శులు శ్రీ @tarunchughbjp శ్రీ @sunilbansalbjp తదితరులు#HyderabadLiberationDay pic.twitter.com/wn1uGiijTw
— BJP Telangana (@BJP4Telangana) September 17, 2022
-
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు..
తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కాసేపట్లో.. హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రాల్లో జెండా వందనం చేస్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 44 కోట్లతో నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
Published On - Sep 17,2022 8:26 AM