
తెలంగాణలో ఎన్నికల రణరంగం మొదలైంది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి మరీ బీఆర్ఎస్ యుద్ధం ఆరంభించింది. అటు కాంగ్రెస్ పార్టీలోనూ దరఖాస్తుల స్వీకరణ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. ఈ నెలాఖరులో తొలి జాబితా ప్రకటించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అటు అభ్యర్ధులను ఫైనల్ చేస్తూనే ఇటు ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టాయి పార్టీలు. AICC అధ్యక్షులు ఖర్గే, బీజేపీ అగ్రనేత అమిత్‌షా పర్యటనలు మరింత హీట్ పెంచనున్నాయి.
ఓవైపు బీఆర్‌ఎస్ హామీలతో దూసుకొస్తోంది. మరోవైపు డిక్లరేషన్‌తో జనాల్లోకి వస్తోంది కాంగ్రెస్. ఇక క్షేత్రస్థాయిలో ఉద్యమాలతో ఉరకలెత్తుతోంది బీజేపీ. ఎన్నికల షెడ్యూల్ రాకముందే టికెట్లు ప్రకటించి మరీ యుద్ధానికి సై అంటూ కదనరంగంలోకి దిగింది బీఆర్ఎస్. లీడర్లు, క్యాడర్ అంతా జనాల్లోకి వచ్చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీలతో ఆకట్టుకుంటున్నారు. చేసిన అభివృద్ధిని చెబుతూ. చేయబోయే పనులు వివరిస్తూ మరోవైపు విపక్షాలను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు కేసీఆర్. అధినేత ఆదేశాలతో నియోజకవర్గాల్లోనూ నేతలు దూకుడు పెంచారు. మా సీఎం అభ్యర్ధి కేసీఆర్ మీ సీఎం క్యాండిడేట్ ఎవరంటూ విపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. గులాబీ పార్టీ ఇది తగ్గేదే లే అంటూ విజయంపై ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు.
ఆశావహులను నుంచి ధరఖాస్తులు తీసుకుంటూనే జనాలను హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రైతులకు, యువతకు డిక్లరేషన్లు ప్రకటించిన టీపీసీసీ రేపు చేవెళ్లలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గె చేతుల మీదుగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించబోతోంది. తెలంగాణలో 70 సీట్లతో విజయం ఖాయమంటూ ధీమాగా ఉన్నారు పీసీసీ పెద్దలు. అటు బీజేపీ కూడా తెగ స్పీడు పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై ఫోకస్ పెంచిన పార్టీ.. క్షేత్రస్థాయిలో జనాలకు దగ్గరయ్యేందుకు ఉద్యమాలను నమ్ముకుంది.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై నిన్న మంత్రుల నివాసాల ముట్టడి నిర్వహించిన కమలనాథులు.. శుక్రవారం కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమంటున్న బీజేపీ నేతలు 27న ఖమ్మం అమిత్‌షా సభ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో లీగ్‌లో విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల్లో ప్రజామద్దతు ఎవరికి లభిస్తుందో కాలమే నిర్ణయించాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..