మునుగోడు రాజకీయాలు రంజుగా మారాయి. బై పోల్ వేళ.. కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలని చూస్తోన్న అధికార టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఊగిసలాటకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. మాజీ ఎంపీ బూర కారు దిగేందుకు రెడీ అయ్యారు. కమలం కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు భువనగిరి మాజీ ఎంపీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్‌ఎస్ కీలక నేత బూర నర్సయ్యగౌడ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన బూర.. పార్టీలో చేరికపై మంతనాలు జరిపారని టాక్ వినిపిస్తోంది. నేడో, రేపో బీజేపీలో చేరికపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు.. ఢిల్లీ పెద్దలతో బూర చర్చలు జరుపుతున్న సమయంలోనే కీలక కామెంట్స్ చేశారు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్. బూర నర్సయ్యగౌడ్ తనను కలవలేదని, ఆయన బీజేపీలో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని, ఎవరు ఎప్పుడైనా చేరొచ్చన్నారు. ఇక.. ఢిల్లీలోనే ఉన్న అధినేత కేసీఆర్ పిలుపు కోసం బూర ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ పిలిచి బుజ్జగిస్తారన్న బూర భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోతే బీజేపీలో చేరికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన బూర నర్సయ్యగౌడ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో పోటీ చేసిన ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అధిష్ఠానం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..