ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు విస్తృత సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను యాదగిరిగుట్ట మీదుగా జనగామ వరకు పొడిగించాలని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఎంపీ వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణ అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వివరాలను మీడియాకు తెలిపారు.
భువనగిరి రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా శాతవాహన, పద్మావతి, కోణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఇక నడికుడి రూట్‌లో డబ్లింగ్ లైన్ చేయాలని, చిట్యాల-సిరిపుర రైల్వే స్టేషన్ల మధ్య గేటు వద్ద.. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాదు రామన్నపేట రైల్టే స్టేషన్‌లో పునర్నిర్మాణ పనులుతో పాటుగా.. ఇక్కడ చెన్నై, శబరి, డెల్టా ప్యాసింజర్ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. తాను చేసిన విజ్ఞప్తులకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.