Tellam Confusion: ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే.. గోడదకూకి తప్పుచేశానని భావిస్తున్నారా..?

| Edited By: Balaraju Goud

Nov 02, 2024 | 9:41 PM

నియోజకవర్గంలో మెజార్టీ క్యాడర్ తెల్లం వెంకట్రావుకు సహకరించడం లేదట. పొడెం వీరయ్యతోనే మెజార్టీ కాంగ్రెస్‌ క్యాడర్‌ ఉంది. వీళ్లిద్దరూ కలిసి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటివరకూ పాల్గొనలేదు.

Tellam Confusion: ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే.. గోడదకూకి తప్పుచేశానని భావిస్తున్నారా..?
Tellam Venkatarao
Follow us on

ఉరికి ఉరికి పాలు తాగే కంటే.. నిలబడి నింపాదిగా నీళ్లు తాగడం చాలా మంచిది. రాజకీయాల్లోనూ ఈ సూత్రం అప్పుడప్పుడు బాగా పనికొస్తుంది. అలా తొందరపడి గోడ దూకిన ఓ ఎమ్మెల్యే.. పడరాని పాట్లు పడుతున్నారట. క్షేత్రస్థాయిలో అనుకున్నంత ఈజీగా లేదంట వ్యవహారం. దీంతో, తీవ్రస్థాయిలో వర్గ పోరుతో ఇబ్బంది ఎదుర్కొంటున్న ఆ శాసనసభ్యుడు.. తర్జనభర్జన పడుతున్నారట..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలం నుంచి గులాబీ జెండా ఎగరేసిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో అందరి కన్నా ముందే కండువా మార్చేశారు. అయితే, నియోజక వర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారారని చెప్పుకున్న ఈ ఎమ్మెల్యేకు.. తాజాగా తత్వం బోధపడినట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్‌ పాత, కొత్తలుగా విడిపోవడంతో.. చుక్కలు కనిపిస్తున్నాయంట. ఓవైపు అంతర్గత పోరు.. మరోవైపు అనర్హత వేటు పడుతుందనే ప్రచారం.. వెరసి.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కాస్తా ఆవిరయ్యేలా ఉందట పరిస్థితి.

కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యపై గెలిచిన తెల్లం వెంకట్రావు.. ఇప్పుడు అదే వీరయ్యతో కలిసి కాంగ్రెస్‌లో కొనసాగాల్సిన పరిస్థితి. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బలంతో.. వెంకట్రావు కాంగ్రెస్‌లోకి రావడం.. భద్రాచలం నియోజకవర్గంలో పూర్తిగా రాజకీయ సమీకరణలను మార్చేసింది. ఓడిన పోడెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కడంతో.. ఆయన ఎక్కువగా హైదారాబాద్‌కే పరిమితమవుతున్నారు. దీంతో లోకల్‌గా ఉంటున్న జంపింగ్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సినిమా చూపిస్త మావా అంటోంది కాంగ్రెస్‌ క్యాడర్‌. దీంతో, నియోజక వర్గంలో చాలా సవాళ్లే ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత అవసరాలకు పార్టీ మారే నాయకుడంటూ.. వెంకట్రావుపై కింది స్థాయిలో బాగా వ్యతిరేకత వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

మాట మీద నిలబడే వ్యక్తి కాదని.. ఎపుడెలా ఉంటారో తెలియదని.. తెల్లం గురించి నియోజకవర్గ క్యాడర్‌ చర్చించుకుంటోందట. దీనికి కారణాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందు పొంగులేటితో కలిసి BRS నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన తెల్లం.. టికెట్ ఇవ్వలేదని అప్పటికప్పుడు హైదారాబాద్ వెళ్లి మళ్లీ BRS కండువా కప్పేసుకున్నారు. ఆ పార్టీ నుంచి గెలిచినా.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మళ్లీ కండువా మార్చారు. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ పై పోటీచేసినా తన రాజకీయ గురువు పొంగులేటి వల్లే గెలిచానంటూ.. ఇప్పుడు చెప్పుకొంటున్నారు వెంకట్రావు. దీంతో, ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారనే విమర్శలు తెల్లంపై వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా నియోజకవర్గంలో మెజార్టీ క్యాడర్ తెల్లం వెంకట్రావుకు సహకరించడం లేదు. పొడెం వీరయ్యతోనే మెజార్టీ కాంగ్రెస్‌ క్యాడర్‌ ఉంది. వీళ్లిద్దరూ కలిసి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటివరకూ పాల్గొనలేదు. ఒకటి రెండు సార్లు హాజరైనా..ఇద్దరూ ఎడమొహం.. పెడమొహంగానే ఉన్నారు. దీంతో రెండు వర్గాల మధ్య సఖ్యత కరువైంది. సొంత వర్గాన్ని తయారుచేస్తూ.. అసలైన కాంగ్రెస్ నేతలు, క్యాడర్‌ను పట్టించుకోవడం లేదంటూ తెల్లం వెంకట్రావుపై మరో వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం జరుగుతుండటంతో… భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుపైనా వేటు ఖాయమని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కండువా కప్పుకుని పర్యటించడం లేదు తెల్లం వెంకట్రావు. ఏదో నామ్‌కే వాస్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇటు నియోజకవర్గంలో వర్గపోరు.. అటు పార్టీలో సహకరించని క్యాడర్.. మరోవైపు అనర్హతవేటు ప్రచారం… వీటన్నింటి మధ్య ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారట తెల్లం. ఈ కన్ఫ్యూజన్‌లో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తి రేపుతోంది..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..