
భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (PA)పై ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదైంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు PAగా పనిచేస్తున్న కళ్యాణ్ కుమార్‌పై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
భద్రాచలం అంబా సత్రంకు చెందిన రాయల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాధితుల ఆరోపణల ప్రకారం.. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్న అనంతరం కొందరికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది బాధితులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో కళ్యాణ్ కుమార్‌ను బాధితులు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయన అందుబాటులో లేరని, పరారీలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో భద్రాచలం ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన బాధితులు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో లక్షల రూపాయలు ఇచ్చామని, ఇప్పుడు డబ్బులు పోయి ఉద్యోగం కూడా రాక తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు కళ్యాణ్ కుమార్ ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులను విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు? నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ల వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలపై కళ్యాణ్ కుమార్ లేదా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తరఫున అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆరోపణలకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..