బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో అలజడి రేపుతుంది. ఇప్పటికే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ 86 మందిలో అత్యధికంగా తెలుగు వారే ఉండటం, అందులోను సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ సైతం కన్నేసి ఉంచింది. అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్ళాయని అనుమానిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కూడా బెంగుళూరు పార్టీని చాలా సీరియస్‌గా గమనిస్తున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారనుంది. సాధారణంగా మన దగ్గర డ్రగ్స్ కేసులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ బెంగళూరు లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్టులు చేసిన దాకాలు కూడా ఉన్నాయి. మరి బెంగళూరు ఫామ్ హౌస్ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇండస్ట్రీ పేర్లు ఎప్పుడు తెరమీదకి వచ్చినా, వారికి కేవలం నోటీసుల వరకు మాత్రమే విచారణ పరిమితం అవుతుంది. డ్రగ్స్ కేసులలో చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు కూడా నిందితులకు సానుకూలంగా మారుతున్నాయి. డ్రగ్స్ కేసులలో శిక్ష పడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీ పేరు వచ్చిన ప్రతిసారీ తూతూ మంత్రంగా జరిగే విచారణలు కాకుండా చాలా పగడ్బందీగా చర్యలు చేపట్టాల్సిందే..!
ఇండస్ట్రీకి డ్రగ్స్ కొత్త కాకపోయినప్పటికీ, మన ఇండస్ట్రీ పరువును పక్క రాష్ట్రాల్లో తీయడం ఒకరకంగా ఇండస్ట్రీకి పెద్ద మచ్చ లాంటిదే. మన రాష్ట్రంలో డ్రగ్స్ కేసులలో సినీ తారలు ఇరుక్కున్నప్పుడు ఉండే హడావిడి ఆ తర్వాత కనిపించదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో సినీ తారలు దొరికిన వారి శాంపుల్స్ సేకరణ, ఆ తర్వాత పాజిటివ్ వస్తే నోటీసులు, మళ్లీ విచారణ పేరుతో కాలయాపన తప్పా, ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకున్నట్టు కోర్ట్‌లలో రుజువు చేయలేకపోయారన్న అపవాదు ఉంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ తో పాటు గుడి మల్కాపూర్ డ్రగ్స్ కేస్ ఆ తర్వాత వచ్చిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేస్, ఈ విధంగా పలు కేసుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తారల పేర్లు బయట పడుతూ వచ్చాయి. కానీ ఇన్ని కేసుల్లో ఒక్క సినీ సెలబ్రిటీ కూడా జైలు పాలైన సందర్భాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు కేసు నమోదు అయింది బెంగళూరులో కాబట్టి ఒకసారిగా సినీ ఇండస్ట్రీ కూడా అలర్ట్ అయింది.. బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లి పోలీస్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదే ఇండస్ట్రీ వర్గలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ హేమ పోలిసుల విచారణ హాజరైతే, ఆమె ఎలాంటి విషయాలు బయటపెడుతుందనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ వెరీ కామన్. అయితే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొందరికి పార్టీల్లో డ్రగ్స్ అలవాటు అవుతుంటుంది. మరి హేమా వ్యవహరంలో ఎవరు ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశారు..? ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటుంది..? ఈమె బ్యాచ్ లో ఉన్నది ఎవరు..? ఇలా అనేక విషయాలను బెంగుళూరు పోలీసులు కూపీ లాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో హేమ విచారణపై ఫోకస్ పెట్టారట పలువురు కన్స్యూమర్లు.
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సైతం దృష్టి సారించారు. సాధారణంగా తెలంగాణలో నార్కోటిక్ ఎన్‌పోర్స్‌మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికినా, వెంటనే వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ తరుణంలో బెంగళూరు రేవ్ పార్టీలోనూ ఎక్కడినుండి డ్రగ్స్ ఆ పార్టీకి వెళ్లాయి అనే వ్యవహారంలో హైదరాబాద్ న్నార్కోటిక్ పోలీసులు సైతం దృష్టిసారించారు.. అందులోనూ ఈ పార్టీలో దొరికింది తెలుగు వారు ఎక్కువగా ఉండటంతో వారి వివరాలను సైతం నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. నార్కోటిక్ పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్‌ను కొంతైనా నిర్మూలించగలిగారు.
ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం శివార్లలో ఉన్న ఫాంహౌజ్‌ల్లో నిరంతరం నార్కోటిక్ పోలీసుల తోపాటు లోకల్ పోలీసుల నిఘా ఉంటుంది. ఈ చర్య కారణంగానే హైదరాబాద్‌ను కాదని బెంగళూరుకు వెళ్లి మరి పార్టీ చేసుకున్నారు ప్రముఖులు. పార్టీ బెంగళూరులో జరిగిన పట్టుబడింది తెలుగువారు ఎక్కువగా కావడంతో, మన రాష్ట్ర పోలీసుల సైతం దీనిపై ఆరా తీస్తున్నారు. ఇలా ఒక్క కేసుతో ఎన్నో చిక్కు ముడులు వీడే అవకాశం కోసం నార్కోటిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్టీకి హాజరైన డ్రగ్ కన్జ్యూమర్ల వివరాలు నార్కోటిక్ పోలీసుల చేతికి రానున్నాయి. దీంతోపాటు ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన పెగ్లర్లపై సైతం హైదరాబాద్ నార్కోటిక్క్ పోలీసులు కన్నేసి ఉంచుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…