మంత్రి హరీష్ రావు తన ప్రచార సరళిని మార్చారు.. సీఎం కేసీఆర్ ఆదేశాలు పాటిస్తూ ఇతర జిల్లాలో ప్రచారం చేస్తూనే..ఉమ్మడి మెదక్ జిల్లా పై దృష్టిసారించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తన సొంత జిల్లా పై దృష్టి సారించారు. పది నియోజకవర్గలో తన మనుషులను ఇంచార్జ్ లుగా నియమించారు. పది నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రి హరీష్ రావు తన సొంత జిల్లాపై ఫోకస్ పెంచారు.
ఇతర జిల్లాలపై దృష్టి సారిస్తూనే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొంత ఇబ్బందిగా ఉన్న నియోజకవర్గాలపై ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ నేతలను, అభ్యర్థులను పరుగులు పెట్టిస్తున్నారు. అభ్యర్థులు ప్రచారం ఎలా చేస్తున్నారు, ప్రజల నుంచి నుంచి రెస్పాన్స్ ఏవిధంగా వస్తుంది.? అనే విషయాలపై అన్ని నియోజకవర్గాల ఇంఛార్జిలతో ఎప్పటికప్పుడు సమీక్షలు పెడుతూ, ఆయా ప్రాంతాల్లో ఉన్న నేతలకు పలు సూచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు,పార్టీ మేనిఫెస్టో జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తానే నేరుగా రంగంలోకి దిగి వాటిని సాల్వ్ చేస్తూ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు మంత్రి హరీష్ రావు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు సీనియర్ నేతలను టిఆర్ఎస్ పార్టీలో చేర్పించడంలో కీలక పాత్ర వహించారు మంత్రి హరీష్ రావు. టీపీసీసీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి బీజేపీ ఇన్‌చార్జ్ రాజీవ్ దేశ్ పాండే, మెదక్ పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, నర్సాపూర్ బీజేపీ ఇంచార్జ్ సింగాయిపల్లి గోపి లాంటి వ్యక్తులను సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలోకి చేర్పించారు మంత్రి హరీష్ రావు.
ఈ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలావరకు ప్లస్ అయిందని చెప్పాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేసి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని పలు సందర్భాల్లో చెప్పారు మంత్రి హరీష్ రావు. ఇందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటకు తక్కువ సమయాన్ని కేటాయించి, మిగతా 9 నియోజకవర్గాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వెల్, మెదక్ లాంటి నియోజకవర్గల పై సీరియస్ గా దృష్టి సారించారు.
గజ్వెల్‌లో ఈటెల రాజేందర్, అందోల్‌లో దామోదర రాజనర్సింహ, సంగారెడ్డిలో జగ్గరెడ్డి ప్రత్యర్ధులుగా ఉన్న నేపథ్యంలో వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ధైర్యాన్ని నింపుతున్నారు. ఇక సమయం చిక్కిన ప్రతిసారీ తాను కూడా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఓకే రోజు రెండు నుంచి మూడు నియోజకవర్గలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకొని తన ప్రచారంలో ప్రతిపక్షాలను ఎండగడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..