
ఆమె మానసిక స్థితి సరిగా లేదు..పైగా అనారోగ్య సమస్యలు..ఏమి చేయాలో తెలియక..బంధువులు సూచనతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతలోనే మరో పిడుగు లాంటి ఘటన. ఎవరికి చెప్పకుండానే ఆసుపత్రి నుంచి ఎటో వెళ్లిపోయింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమెను గుర్తు పట్టడం, ఆమె ఎవరికైన తన వివరాలు చెప్పడం కష్టంగా మారింది. రెండున్నరేళ్లుగా అమ్మ తిరిగొస్తుందని ఎదురుచూసిన ఆ కుటుంబం ఇక ఆశలు వదులుకొని సంప్రదాయం ప్రకారం ఆమెకు కర్మకాండలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇంతలో ఇంట్లో ఫోన్ మోగింది. మీ అమ్మ మా వద్ద క్షేమంగా ఉన్నారు.. వచ్చి తీసుకెళ్లండని అవతలి వ్యక్తి చెప్పడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం మండలం ఎల్. కోట గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. మానసిక సమస్యలతో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. భార్యపై బెంగ, దిగులుతో ఆమె భర్త మూడు రోజులకే చనిపోవడంతో కుటుంబ సభ్యులు మరింత విషాదంలో మునిగిపోయారు. రెండున్నరేళ్లు గడిచినా వెంకటలక్ష్మి తిరిగి రాక పోవడంతో కర్మకాండలు చేయించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఖమ్మంలోని అన్నం సేవాశ్రమం నిర్వాహకులు ఫోన్ చేసి వెంకటలక్ష్మి మా వద్దే ఉన్నారని చెప్పడంతో ఆమె చిన్నకుమారుడు గురవయ్య, బంధువులు ఖమ్మం లోని అనాథ ఆశ్రమానికి వచ్చారు. తల్లిని పట్టుకుని గురవయ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఖమ్మం పరిసరాల్లో తిరుగుతుండటంతో పోలీసులు 2023 జులైలో తమ ఆశ్రమానికి తీసుకొచ్చారని, చికిత్స అందించడంతో కోలుకొని ఆమె వివరాలు చెప్పారని నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఆశ్రమం తరపున గురవయ్య, ఆయన బంధువులను శాలువాతో సత్కరించి వెంకటలక్ష్మిని కుమారుడుకి అప్పగించారు.