తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్
Ap Deputy Cm Pawan Kalyan

Updated on: Jun 04, 2026 | 7:16 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై తన వైఖరి ఎల్లప్పుడూ ఒక్కటేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “విభజన తర్వాత శాంతిభద్రతల సాకుతో ‘సెక్షన్ 8’ అమలు చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, స్వపరిపాలన హక్కును దెబ్బతీస్తుందని నాడే చెప్పాను” అని పవన్ గుర్తుచేశారు. ఆంధ్రా ప్రజల భద్రత ఎంత ముఖ్యమో, తెలంగాణ ప్రజల హక్కులను గౌరవించడం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద నిబంధనల కంటే.. పరస్పర నమ్మకాన్ని, సోదరభావాన్ని పెంపొందించే సమన్వయ కమిటీలు, పార్లమెంటరీ పర్యవేక్షణ ద్వారానే నిర్మాణాత్మక పరిష్కారాలు సాధ్యమవుతాయని, తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలను తాను ఎన్నడూ సమర్థించనని పవన్ తేల్చిచెప్పారు.

మరోవైపు, వైఎస్సార్ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు లేఖ రాశారు. వైఎస్సార్‌కు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పవన్‌పై ఎలాంటి కేసులు పెట్టలేదని, ఒకవేళ కేసులు పెట్టమన్నారని ఏ పోలీస్ అధికారి అయినా చెబితే అతనికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయాలన్నారు. ఆ అధికారి చెప్పింది నిజమని తేలితే తాను తెలంగాణ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు లేదా స్వచ్ఛంద సంస్థకు 10 కోట్లు విరాళంగా ఇస్తానని కేవీపీ సవాల్ విసిరారు. వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు పవన్‌ను డిప్యూటీ సీఎంగా గెలిపిస్తే, ఇక్కడి ఎజెండాను పక్కనపెట్టి తెలంగాణకు వెళ్లి బీజేపీ ఎజెండాతో ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన మంచి పోర్ట్‌పోలియోలను సమర్థవంతంగా నిర్వహించాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఎవరు దెబ్బతీసినా తప్పేనని బీజేపీ తెలంగాణ నేత రాంచందర్ రావు పేర్కొంటూనే.. పవన్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us