Telangana: అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా ఊడ్చుకొచ్చి..

డబ్బు డబుల్ అవుతుంది.. గుప్తపూజలు చేస్తే కోట్లు కురుస్తాయి.. ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా, అమాయకులు మాత్రం ఇంకా జాదూగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా షాద్‌నగర్‌లో జరిగిన ఒక దారుణ దోపిడీ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తిని నమ్మించి.. రూ. 9 లక్షలు ఎలా దోచుకున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు

Telangana: అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా ఊడ్చుకొచ్చి..
Andhra Man Robbed Of Rs 9 Lakh In Shadnagar

Edited By:

Updated on: Apr 06, 2026 | 2:26 PM

అమాయకులను లక్ష్యంగా చేసుకుని, రెట్టింపు డబ్బు ఆశ చూపిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న జాదూ ముఠా మరోసారి బరిలోకి దిగింది. గుప్తపూజల పేరిట నమ్మబలికి.. ఏపీకి చెందిన ఓ వ్యక్తిని షాద్‌నగర్‌కు రప్పించి రూ.9 లక్షలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన బాషాకు కొంతకాలంగా ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. షాద్‌నగర్ పరిధిలో కొందరు గురుస్వాములు గుప్తపూజలు నిర్వహిస్తారని.. ఆ పూజల ద్వారా పెట్టిన డబ్బుకు రెట్టింపు లాభం వస్తుందని నమ్మబలికాడు. రూ. లక్ష ఇస్తే రూ.2 లక్షలు తిరిగి ఇస్తారనే మాయమాటలకు బాషా ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.9 లక్షల నగదుతో బాషా శనివారం సాయంత్రం షాద్‌నగర్‌కు చేరుకున్నాడు. ముఠా సభ్యుల సూచన మేరకు పరిగి రోడ్డులోని ఓ కాలనీలో వేచి ఉండగా.. ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి అతడిని కలిశాడు.

పూజలు జరిగే ప్రదేశం రహస్యమని చెప్పి.. పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న వెంటనే ముందే రెడీగా ఉన్న మరో నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా బాషాపై దాడి చేశారు. భయభ్రాంతులకు గురిచేసి, అతడి వద్ద ఉన్న రూ.9 లక్షల నగదును లాక్కొని పరారయ్యారు. జరిగిన దారుణంతో షాక్‌కు గురైన బాషా.. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. నిందితులు వాడిన ఫోన్ నంబర్లు, సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. ఈ ముఠా గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రెట్టింపు డబ్బు, గుప్తపూజలు, నిధి నిక్షేపాల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మకూడదని సూచిస్తున్నారు. పట్టపగలే ఇలాంటి దోపిడీ జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us