టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక్క క్లిక్ తో కావాల్సిన వస్తువు ఇంటి వద్దకు వచ్చేస్తోంది. ఇక ఫుడ్ విషయంలో అయితే ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. సమయం లేదనో, లేట్ అవుతుందనో.. ఇలా వివిధ కారణాలతో చాలా మంది ఫుడ్ డెలివరీ సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. క్షణాల్లో డెలివరీ తీసుకుంటున్నారు. ఇలా ఫుడ్ డెలివరీ చేసే వారు.. ఎండా వానా చలి దేన్నీ లెక్కచేయకుండా ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే.. వారిపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తుర్కయాంజాల్ లో జరిగిన దాడి ఘటనను మరవకముందే.. తాజాగా హుమాయిన్ నగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ నగర పరిధిలో ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. ఆర్డర్ ఆలస్యమైందంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా 15 మందిని వెంటబెట్టుకుని హోటల్ వద్దకు వెళ్లి బీభత్సం సృష్టించాడు. హుమయూన్‌నగర్ లో ఈ ఘటన జరిగింది. భయంతో డెలివరీ బాయ్ హోటల్‌లోకి వెళ్లినా.. వదలకుండా యువకులు డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ స్టవ్ మీద మరుగుతున్న నూనె డెలివరీ బాయ్ పై పడింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. డెలివరీ బాయ్‌తో పాటు మరో ముగ్గురికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ చేసి డెలివరీ బాయ్‌కు డబ్బులు ఇవ్వకుండా దాడి చేశారు. తుర్కయాంజల్ ఏవీ నగర్‌లో ఈ ఘటన జరిగింది. వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి.. స్విగ్గీ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చికెన్ ధమ్ బిర్యానీ ఆర్డర్ రావడంతో డెలివరీ కోసం ఏవీనగర్ వెళ్లాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు బిర్యానీ పార్సిల్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా గొడవకు దిగారు. దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..